ఇల్లందు అభివృద్ధి వీడియోని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన పురపాలకశాఖా మంత్రి కేటీఆర్
హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ , పురపాలక చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు*
మన్యం న్యూస్, ఇల్లందు పట్టణం..గతంలో ఎన్నడు లేని విధంగా ప్రస్తుత పాలకవర్గం మరియు అధికారుల కష్టానికి ప్రతిఫలంగా ఇల్లందు పట్టణ అభివృద్ధిపైన రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలోనూ గుర్తింపు, ప్రశంశలు వస్తున్న విషయం విధితమే. ఇల్లందు మున్సిపాలిటీ అసలు ఎక్కడ ఉంటుందో తెలియని స్థాయి నుండి నేడు ఇల్లందే రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచేవిధంగా అభివృద్ధి జరుగుతుంది. అందుకు ప్రతిరూపాలే జాతీయ స్థాయిలో 18వ స్థానం, రాష్ట్రస్థాయిలో ప్రధమ స్థానం, జిల్లాస్థాయిలో మూడు సంవత్సరాల కాలంలో వరుసగా మూడుసార్లు ప్రథమ స్థానంలో నిలిచింది ఇల్లందు మున్సిపాలిటీ. అనేకమార్లు పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇల్లందు అభివృద్ధిని ప్రశంసించారు.ఈ నేపథ్యంలో ఆదివారం ఐటి , పురపాలక శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన అఫీషియల్ ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలో ఇల్లందు అభివృద్ధిపైన రెండు నిమిషాల నిడివి గల వీడియోని ఇల్లందు అభివృద్ధి అనే ట్యాగ్ లైన్ తో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ మరియు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేటీఆర్ తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఇల్లందు అభివృద్ధి వీడియోని పోస్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది సమిష్టికృషి, శ్రమ ఫలితంగానే ఇల్లందుకు ఇంతటి గౌరవం, గుర్తింపులు దక్కాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత పట్టుదలతో ఇల్లందుని గొప్పగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇల్లందు పురపాలక సంఘానికి సహకరిస్తున్న పట్టణ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.