ఇక, కరోనా మాయం అయ్యింది.. సాధారణ పరిస్థితులు వచ్చాయని అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో.. మళ్లీ మహమ్మారి కేసులు పెరుగుతూ టెన్షన్ పెడుతున్నాయి..
దేశవ్యాప్తంగా కోవిడ్.. మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. 24 గంటల్లోనే 5వేల 880 పాజిటివ్‌లు నిర్దారణ అయ్యాయి. పాజిటివిటీ రేటు దాదాపు 7శాతానికి చేరుకుంది. వారం రోజులుగా పాజిటివిటీ రేటు పెరుగుతుండటం కలవరపెడుతోంది. వైరస్ వ్యాప్తి కట్టడికి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మళ్లీ నిబంధనలను అమలు చేస్తున్నాయ్. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా.. తెలుగు రాష్ట్రాల్లోనూ.. అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. కోవిడ్ బాధితులకు చికిత్స అందించే ఆసుపత్రుల్లో సౌకర్యాలపై.. మాక్ డ్రిల్ నిర్వహించింది. ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం, ఐసోలేషన్, ఆక్సిజన్ వసతి ఉన్న బెడ్‌లు, వెంటిలేటర్, ఐసీయూ బెడ్‌ల వివరాలను సేకరిస్తున్నారు. అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది, అంబులెన్స్‌ల వివరాలను తెలుసుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు, ఆర్టీపీసీఆర్ పరీక్షలు, కిట్ల లభ్యత, పీపీఈ కిట్లు, ఆక్సీమీటర్‌లు, మాస్కులు, వెంటిలేటర్ల సంఖ్య వంటి కీలక అంశాలు గుర్తించి వైద్యారోగ్య శాఖకు అందజేయనున్నారు. హరియాణాలోని ఝజ్జర్ ఎయిమ్స్‌లో జరిగిన మాక్ డ్రిల్‌ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ పరిశీలించారు.
మరోవైపు దేశంలో దాదాపు ఆరు వేల కొత్త కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 6.91శాతానికి చేరుకుంది. వైరస్ కారణంగా 24 గంటల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు చొప్పున మరణాలు నమోదవ్వగా.. కేరళలో ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, జమ్మూకశ్మీర్‌లో ఒక్కొక్కరు కరోనాతో మృతి చెందారు. యాక్టివ్ కేసుల సంఖ్య…35వేల 199కి పెరిగింది.