- బిఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధికార ప్రతినిధిగా లాకావత్ గిరిబాబు.
- నిరంతర పార్టీ సేవకుడికి వరించిన గౌరవం.
- గిరిబాబు నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు.
మన్యం న్యూస్: జూలూరుపాడు, ఏప్రిల్ 11, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా లకావత్ గిరిబాబును నియమిస్తున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు సోషల్ మీడియా ద్వారా మంగళవారం ప్రకటించారు. నిరంతరం పార్టీ సేవకుడిగా పనిచేస్తున్న గిరిబాబుకు సరైన గౌరవం దక్కిందని పలువురు పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడం పట్ల ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండా గ్రామానికి చెందిన సీనియర్ ఆ పార్టీ జిల్లా నాయకుడు, విద్యావంతుడు అయిన లకావత్ గిరిబాబు తొలినుంచి సమాజ సేవ కోసం పరితపిస్తూ, అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. తొలినాళ్లలో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, సమాజ సేవ కోసం రాజకీయ మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొంటూ మండలంలోని యువతతో మమేకమై ముందుకు సాగారు. ఆ తర్వాత అప్పట్లో కొత్తగా ఏర్పాటు అయిన ప్రజారాజ్యం పార్టీలో చేరి క్రియాశీల పాత్ర పోషించారు. మాచినేనిపేట తండా గ్రామపంచాయతీ. సర్పంచ్ గా కూడా ఆయన పనిచేసి, గ్రామాన్ని అభివృద్ధి పధంలో నడిపేందుకు ఆయన చేసిన కృషి అభినందనీయంగా మారింది. ప్రస్తుతం మాచినేనిపేట తండా గ్రామపంచాయతీ సర్పంచ్ గా ఆయన సతీమణి, విద్యావంతురాలు లకావత్ భారతి పనిచేస్తున్నారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరి వైరా నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టిన సమయంలో జూలూరుపాడు మండలాన్ని ఖమ్మం జిల్లాలో కలపాలని తొలుత నిర్ణయించింది. ఖమ్మం పట్టణం 60 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో, మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన వస్తుందని, కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతనంగా ఏర్పాటు చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మండలాన్ని కలపాలని ఆయన ఉద్యమాన్ని లేవనెత్తారు. ఉద్యమానికి ఆయన స్వయంగా నాయకత్వం వహించి ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకునే విధంగా చేయడంలో సఫలం చెందారు. ఈ ఉద్యమం ఫలితంగానే జూలూరుపాడు మండలాన్ని ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలుపుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ మార్పుల్లో భాగంగా ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరి ఆనాటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కలిగిన గిరిజన నేతగా లకావత్ గిరిబాబు మంచి పేరు సంపాదించారు. ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్ విప్ రేగా కాంతారావు పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా లకావత్ గిరిబాబును నియమిస్తూ ప్రకటించడం పట్ల పార్టీ శ్రేణులు, ఆయన సన్నిహితులు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.