మన్యంన్యూస్,ఇల్లందు టౌన్ ..భద్రాద్రి జిల్లా జెడ్పీ ఛైర్మెన్ కోరం కనకయ్య పై ఇల్లందు పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. విద్యావంతులైన ఎమ్మెల్యే హరిప్రియ, మార్కెట్ ఛైర్మెన్ హరిసింగ్ నాయక్ లపై ఈశ్వరుడు నోరిచ్చాడుగా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇల్లందుకు చేసింది శూన్యమని, నేడు ఎమ్మెల్యేగా ఉన్న హరిప్రియ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదని ముందుగానే గ్రహించిన కోరం ఆ కక్ష్యతోనే ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పొంగులేటితో చేతులు కలిపి తల్లిలాంటి బీఆర్ఎస్ పార్టీకి అన్యాయం చేసిన వ్యక్తి కోరం అని తెలిపారు.కోరం పరిస్థితి నేడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నచందంగా తయారైందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కాకముందు ఏమీలేని కోరం కనకయ్య ఎమ్మెల్యే అయ్యాక అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తాడని, కోయాగుడెం ఒసీలో వసూళ్ల పర్వానికి తెరలేపాడని, ఆయన కుటుంబసభ్యుల, బినామీల పేర్లతో అనేక కబ్జాలు చేశాడని దుయ్యబట్టారు. సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే దంపతులపై ఇకనైనా నీ తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఆగ్రహావేశాలను చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే దంపతులపై అసత్య ఆరోపణలు చేసిన నీవు వాటిని నిరూపించాలని, లేనిపక్షంలో రాజకీయ సన్యాసం చేస్తావా అంటూ ప్రశ్నించారు. నీ వెంట ఉన్న అనుచరులే నీతో నడిచే పరిస్తితి లేదని, కనీసం జెడ్పీటీసీగా గెలిచే సత్తా లేని నిన్ను హరిప్రియ, హరిసింగ్ నాయక్ లు అహర్నిశలు శ్రమించి గెలిపిస్తే నేడు హరిప్రియ సిఫార్సుమేరకు జెడ్పీ ఛైర్మెన్ గా అందలమెక్కి కళ్ళు నెత్తికెక్కాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంట్రాక్టర్లను ముంచి కొట్లసొమ్మును మూటగట్టుకున్న పొంగులేటి నీకో నాయకుడని అతన్ని నమ్ముకున్న నీవు భూ బకాసురుడు అని ఆరోపించారు. అవినీతి, అన్యాయాల గురించి కోరం,పొంగులేటిలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఇల్లందు చరిత్రలో ఏనాడూ జరగని అభివృద్ధిని ఎమ్మెల్యే అయిన అనతికాలంలోనే చేసి చూపారని, నాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీహామీని నెరవేరుస్తూ హరిప్రియ నాయక్ ముందుకు సాగుతున్నారు అని పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కోరం లాంటివ్యక్తులు ఎవరెన్ని కుట్రలు చేసినా ఇల్లందు ప్రజల ఆశీస్సులు హరిప్రియకు మెండుగా ఉన్నాయని హరిప్రియ నాయక్ గెలుపును ఎవరూ ఆపలేరని శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
