మా పయనం పొంగులేటి తోనే!
రేగా కాంతారావు కట్టప్పలను చూసుకొని కాపాడేవారు అనుకుంటున్నాడు.
ధన లాభం కోసమే బిఆర్ఎస్ పార్టీలో చేరాడు.
అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వని ఎమ్మెల్యేతో మేము ఉండలేం.
మన్యం న్యూస్, పినపాక:
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి తప్పించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ పినపాక మండలానికి చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. గురువారం నాడు ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోని జివిఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాజీనామాకు గల కారణాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటులా ఉండి స్వార్థ ప్రయోజనాల కోసం బిఆర్ఎస్ పార్టీలో రేగా కాంతారావు చేరినాడని అన్నారు. తొమ్మిది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీకి సేవలందించినందుకు పొంగులేటిని సస్పెండ్ చేయడం దారుణం అన్నారు. రాళ్లవాగు వద్ద ఆత్మీయ సమ్మేళనంలో పలువురు పొంగులేటి పై విమర్శలు చేశారని, స్వప్రయోజనాల కోసం, రేగా కాంతారావు మోచేయి నీళ్లను తాగేవాళ్లు, కాంట్రాక్టుల కోసం కక్కుర్తి పడేవారు, మాజీ ఎమ్మెల్యే పాయం వెంట ఉండి ప్రస్తుత ఎమ్మెల్యేను తిట్టినవారు, ఇప్పుడు ఆయన పక్కన కూర్చొని పొంగులేటిని విమర్శించడం సిగ్గుచేటుగా ఉందన్నారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రక్కన కట్టప్పలు ఉండి రాజకీయాలు చేస్తున్నారని, వారిని చూసుకొని రేగా కాంతారావు భవిష్యత్తుని నిర్లక్ష్యం చేసుకుంటున్నారని అన్నారు. రాజకీయ అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వని వ్యక్తి దగ్గర పని చేయడానికి సిద్ధంగా లేవని అన్నారు. రేపు ఎన్నికల్లో ఓడిపోతే వారే పార్టీ మారి మరల అతడిని కూడా విమర్శిస్తారనీ అన్నారు. అలాంటి వాళ్ళు పొంగులేటి గురించి మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. త్వరలోనే తమ నాయకులతో మాట్లాడి కార్యచరణ ప్రకటిస్తామని, ప్రతి గ్రామానికి వెళ్లి టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసగిస్తుందో వివరిస్తామని తెలియజేశారు. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పద్మవ్యూహంలో ప్రతి ఒక్క టిఆర్ఎస్ నాయకుడు బందీ అవుతాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పోట్లపల్లి ఉపసర్పంచ్ కస్తూరి లింగయ్య, పేరం వెంకటేశ్వరరావు, ఉడుముల లక్ష్మారెడ్డి, మల్లారం మాజీ ఉపసర్పంచ్ పోలెబోయిన రామనాథం, వార్డు నెంబర్లు తోలం కృష్ణ, బడే కృష్ణ, బడే కిషోర్, అనిల్, ఉప్పాక వార్డు నెంబర్ నవాటి శ్రీను, మాజీ మార్కెట్ డైరెక్టర్ కొమరం రాములు, మాజీ ఉపసర్పంచ్ తోలెం అర్జున్, కమిటీ మెంబర్ తాళ్లగుట్టయ్య, బడే రామన్న, పడిగ నరసింహారావు, బిక్క నరసింహారావు, ఉడుముల రవీందర్ రెడ్డి, సమ్మయ్య, అనిల్, అబ్బయ్య, ఆర్య నాగభూషణం, లోడిగ ముత్తయ్య, కస్తూరి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.