మన్యం న్యూస్, అశ్వరావుపేట, ఏప్రిల్ 13: మండల పరిదిలోని మామిళ్ళవారి గూడెం గ్రామ పంచాయితీ ఉసిర్లగూడెం గ్రామంలో గురువారం చెరువులో మునిగి ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. వివరాలు ఎలా ఉన్నాయి. ఉసిర్ల గూడెంకు చెందిన కొర్స చందు అలియాస్ ఏసుబాబు (17) వ్యవసాయ కూలి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. చందు తండ్రితో పాటూ మరికొందరు చేపలు పడుతుండగా చందు మిత్రులు చెరువులో ఈతకు దిగారు. చందు కూడా నీటిలోనికి దిగాడు తండ్రి వారిస్తున్నా కొద్దిగా లోతుకు వెళ్లి ఈత రాకపోవడంతో రెప్పపాటులో నీటిలో గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్ళు చెరువులో గాలించి చందు మృతదేహాన్ని బయటకు తీశారు. కళ్ళముందే కొడుకు చెరువులో మునిగిపోయి చనిపోవడంతో దగ్గర ఉండి కూడా కాపాడుకోలేకపోయానని తండ్రి రోదించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు అశ్వారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహానికి పంచనామా జరిపించి, విచారణ చేపట్టారు. మృతునికి అమ్మ నాన్న చెల్లి ఉన్నారు. ఈ ఘటన ఉసిర్లగూడెం గ్రామంలో విషాదం నింపింది.