- ప్రత్యర్ధుల ప్రచారం తిప్పికొట్టండి
- నోరు తెరవకుంటే పదవులు కట్
- గులాబీ నేతలకు..
బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రేగా కాంతారావు వార్నింగ్
గోడమీద పిల్లులంతా వెళ్లారు.. ఇక మిగిలింది వజ్రాల్లాంటి కార్యకర్తలే
మన్యంన్యూస్ ప్రత్యేక ప్రతినిధి-
ప్రత్యర్ధుల తప్పుడు ప్రచారం ఎప్పటికపుడు గులాబీనేతలు తిప్పికొట్టాలని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. అధికార ప్రతినిధులు, మండల అధ్యక్షులు ప్రత్యర్ధులపై నోర్లు మెదపక పోతే పదవులు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని రేగా పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు,మండల అధ్యక్షులు, స్థానిక నాయకులు కలిసి మీ ప్రాంతంలో జరిగే అభివృద్ది పనులను పరిశలించడం ద్వారా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయాలని రేగా కాంతారావు సూచించారు. చేసిన పనులు చెప్పుకోక పోతే … అబద్ధాలే నిజాలవుతాయని, సోషల్ మీడియా సైనికులు అప్రమత్తంగా ఉండి ప్రచారం పై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాలో వేల కోట్ల నిధులతో అభివృద్ది పనులు జరుగుతున్నాయని, కాదనే దమ్ము ఎవరికైనా ఉందా అని రేగా ప్రశ్నించారు. ప్రతీ సైనికుడు కదనరంగంలో దిగి ప్రచారంపై దృష్టి పెట్టాలన్నారు.
ఇక మిగిలింది వజ్రాలే
ఎవరెటో పూర్తిగా స్పష్టత వచ్చిందని, జిల్లాలో గోడమీద పిల్లులందరూ గోడదూకారని రేగా కాంతారావు అన్నారు. ఇక మిగిలింది వజ్రాల లాంటి కెసిఆర్ సైన్యం మాత్రమేన్నారు. ప్రతీ ఒక్కరూ అంకితభావంతో మరోసారి కేసీఆర్ ప్రభుత్వం వచ్చేందుకు శ్రమించాలన్నారు.