- ముగిసిన పెద్దమ్మ తల్లి కొలుపు
- నిప్పుల గుండంలో నడిచి భక్తిని చాటుకున్న గిరిజన పూజారులు
- కొలుపులో భక్తులను ఆకట్టుకున్న సరువుల ఊరేగింపు కార్యక్రమం
- ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసల బుచ్చయ్య
మన్యం న్యూస్: జూలూరుపాడు, ఏప్రిల్ 16, మండల పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో ఏప్రిల్ 8న ప్రారంభమైన పెద్దమ్మ తల్లి కొలుపు కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. తొమ్మిది రోజులు జరిగిన జాతరలో శుక్ర, శని, ఆదివారాలలో నిర్వహించిన కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. శనివారం సాయంత్రం జరిగిన సరువుల ఊరేగింపు కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. చివరి రోజు ఆదివాసి నాయక పోడ్ గిరిజన సాంప్రదాయ పూజల అనంతరం జలకమాడి, అమ్మవారి కళ్యాణాన్ని భక్తుల కోలాహలం నడుమ ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి పీఠానికి ఎదురుగా ఏర్పాటుచేసిన నిప్పులు గుండంలో ఆదివాసి గిరిజన పూజారులతోపాటు, అమ్మవారి భక్తులు నిప్పుల గుండంలో నడిచి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆదివాసి నాయక పోడు సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసల బుచ్చయ్య పాల్గొని మాట్లాడుతూ నాయక పోడులు రాష్ట్రవ్యాప్తంగా తమ సంస్కృతిని, సాంప్రదాయలను పూర్వకాలం నుండి కొనసాగిస్తున్నామని, నేడు కొలుపుల నిర్వహణ ఖర్చు పెరగడంతో చాలా ప్రాంతాలలో మా సంస్కృతి కనుమరుగవుతుందని అన్నారు. ప్రభుత్వాలపై ఆదివాసి గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ఆదివాసి గిరిజనుల జాతరలకు ప్రభుత్వం నిధులు కేటాయించి, గిరిజన సాంప్రదాయాలను కాపాడాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయక పోడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి సంఘం నాగరాజు, గుడి గిరిజన పూజారి గణప కృష్ణ, కుల పెద్ద కాసిని వెంకటేశ్వర్లు, కొలుపు నిర్వహణ కమిటీ సభ్యులు బూరం రమేష్, సంగం చిన్నరాజు, గుజ్జుల రవి, గణప వెంకన్న, బూరుగు నరసింహారావు, పోతిని సత్యం, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.