-అయ్యా సారు… గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు ఏవి…?
-ఆగని గ్యాస్ ఏజెన్సీల ఆగడాలు….
-ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీల నిర్వాహకులు.
-పట్టించుకోని సంబంధిత అధికారులు.
మన్యం న్యూస్, మణుగూరు, ఏప్రిల్ 17: మణుగూరులో గ్యాస్ ఏజెన్సీల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ నడిరోడ్లపై గ్యాస్ ఏజెన్సీలు వెలుస్తున్నాయి. అయినా సరే అధికారులకు మాత్రం ఇవేమి కనిపించడం లేదు. ఇళ్ల మధ్యలో, రద్దీగా ఉన్న ప్రదేశంలో గ్యాస్ ఏజెన్సీలను ఏర్పాటు చేశారు. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఇందుకు బాధ్యత ఎవరు వహించాలి. ఇంట్లో వాడే సిలిండర్లను హోటల్స్ కు వేస్తూ గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తి కూడా చూడరు. దీంతో అధికారులకు భారీగానే ముడుపులు ముడుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి. చట్ట వ్యతిరేకం అని తెలిసినా ఏమవుతుందిలే అనే ధీమాతో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. దాడులు నిర్వహించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. దీంతో అసలు సివిల్ సప్లై అధికారులు ఉన్నారా లేరా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్యాస్ ఏజెన్సీల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.