మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:బీఆర్ఎస్ పార్టీ మీద, ఎమ్మెల్సీ తాతా మధు మీద అసత్య ఆరోపణలు చేసిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనుచర వర్గం మద్ది బేబీ స్వర్ణకుమారి ఆరోపణలను ఇల్లందు బీఆర్ఎస్ పట్టణ, మండల పార్టీ శ్రేణులు ఖండించారు. ఈ నేపథ్యంలో గురువారం ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా సీనియర్ నాయకులు యలమద్ది రవిలు మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుపై ఏవైతే అవాక్కులు చివాక్కులు పేలుతున్న స్వర్ణకుమారి అసలు నీవు ఎక్కడి నుండి వచ్చావు, నీ స్థాయి ఏమిటి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఒక మహిళ అయిన నీవు నీ స్థాయిని మరిచి నేడు ఎమ్మెల్సీ తాతమధు మీద తప్పుడు, అసత్య ఆరోపణలు చేయడం అనేది నీ రాజకీయ మందబుద్ధికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ఆరోజున మీ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమి ఆశించి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారని, పార్టీలోకి చేరిన తర్వాత వేలకోట్ల రూపాయలతో అక్రమ సంపాదన కూడగట్టుకొని వాపును చూసి బలుపు అన్నట్లుగా ప్రగల్బాలు పలకడం సిగ్గుమాలిన చర్య అని పేర్కొన్నారు. మరి ఆనాడు కేసీఆర్ ని తెలంగాణ దేవుడని, నవసమాజ నిర్మాతగా అభివర్ణించిన పొంగులేటికి నేడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేదుగా మారింది అనేది నీకు నీవు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. పొంగులేటి ఎక్కడ ఉంటే అక్కడ వెన్నుపోటు రాజకీయాలు చేయడం తనకి కొత్తేమి కాదని తనకి అది ఒక రకమైన సాంప్రదాయం అని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఓటమికి పార్టీ నియమావళికి వ్యతిరేకంగా పని చేసింది నిజం కాదా అని ఆనాడు స్వర్ణకుమారి నువ్వు ఎక్కడున్నావ్ అంటూ ప్రశ్నించారు. పదవి ఉంటేనే ప్రజల్లో ఉండటం లేకపోతే ఇంట్లో కుర్చోటం పొంగులేటి నైజమని, ప్రజలు, కార్యకర్తలు చనిపోతే నియోజకవర్గంలో అడుగుపెట్టి తిరిగే పొంగులేటి వారిని పరామర్శించి పదో పరకో ఇచ్చి చేతులు దులుపుకొని ఆయన భజన బృందంతో పబ్లిసిటీ చేసే నీచమైన స్వార్థ నాయకుడు పొంగులేటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా చెప్పుకోవాల్సి వస్తే సీఎం రిలీఫ్ ఫండ్ కింద అనేక మందిని బీఆర్ఎస్ పార్టీ ఆదుకుందనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ తల్లిలాంటి బీఆర్ఎస్ పార్టీని దూషిస్తూ సొంత కుంపటి ఏర్పాటు చేసుకొని ప్రతిపక్ష పార్టీల వద్ద ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్నాడని దుయ్యబట్టారు. ఒక జెండా, ఎజెండా లేకుండా నాలుగురొడ్ల కూడలిలో నిల్చున్న బాటసారిలా మీ నాయకుడు పొంగులేటి పయనం ఉందని, అసలు ముందుగా మీ గమ్యం ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు. రాజకీయ స్వలాభం కోసం పొంగులేటి చేస్తున్న శవ రాజకీయాలను జిల్లా ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని, పొంగులేటి మరియు ఆయనను నమ్ముకొని ఉన్న నాయకులను రాజకీయంగా బొంద పెట్టడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రిని, ఎమ్మెల్సీ తాత మధుని విమర్శించే స్థాయి స్వర్ణకుమారికి లేదని, మరొకసారి తాత మధు మీద తప్పుడు ఆరోపణలు చేస్తే తగిన రీతిలో బుద్ధి చెప్పడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ ఇన్చార్జి సుధీర్ తోత్ల, పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, అధికార ప్రతినిధి కుంట నవాబ్, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షులు ఎస్కే పాషా, ఆర్గనైజింగ్ సెక్రటరీ సనా రాజేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు గండ్రాతి చంద్రావతి, బొప్పి భాగ్యలక్ష్మి, ఇందిరానగర్ వార్డు మెంబర్ నీలం రాజశేఖర్, సునేష్ నాయక్, సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, యువజన నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.