- కార్మికులకు సంపూర్ణ ఆరోగ్య వైద్య పరీక్షలు
- మే 1 నుంచి 3 తేదివరకు ప్రత్యేక క్యాంపులు
- భవన ఇతర నిర్మాణ రంగ కార్మికులు సద్వినియోగం చేసుకోండి…. జిల్లా కలెక్టర్ అనుదీప్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
కార్మిక దినోత్సవం పురస్కరించుకొని కార్మిక శాఖ ఆధ్వర్యంలో మే 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించే కార్మికుల సంపూర్ణ ఆరోగ్య వైద్య పరీక్షలను భవన ఇతర నిర్మాణ రంగా కార్మికులు సద్విని చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ పిలుపునిచ్చారు. గురువారం ఈ మేరకు కార్మిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సంపూర్ణ ఆరోగ్య పరీక్షల కరపత్రాలను ఐ డి ఓ సి కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ మండలి, కార్మిక శాఖ ద్వారా
రిజిస్టరు చేసుకున్న కార్మికులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన
ఈ కార్యక్రమాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. జిల్లాలో ప్రతి గ్రామంలో ఆరోగ్య పరీక్షల క్యాంపులు జరుగుతున్నాయని, ప్రత్యేకంగా కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 1, 2, 3 తేదీలలో ప్రత్యేక క్యాంపులు నిర్వహించుటకు చర్యలు చేపట్టాలని ఆయన కార్మిక అధికారులను ఆదేశించారు.
కార్మికులు అరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యమని ఏ ఒక్కరిని వదలకుండా ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు చేపించాలని ఆయన అన్నారు. కార్మికులకు ఆరోగ్యకరమైన సురక్షితమైన పని విధానాల గురించి సంపూర్ణంగా తెలియదు కాబట్టి నిర్మాణ రంగ కార్మికులు వివిధ పని సంబంధ ప్రమాదాలకు గురవుతుంటారని అలాంటి వారి ఆరోగ్య పరిరక్షణ అత్యంత అవసరమని చెప్పారు. కార్మికులు పనిచేసే చోట భౌతిక, రసాయనిక, జైవిక, మానసిక, సామాజిక అపాయాలు ఉంటాయని వాటన్నిటి నుండి కార్మికులకు అవగాహన కొరకు ఆరోగ్య పరీక్షలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనేక మంది కార్మికులు నిర్మాణ రంగ కార్మికులు కండరాల, ఎముకలు, వినికడి తదితర అనారోగ్యాలకు గురవుతుంటారని వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ఆరోగ్య పరీక్షల చేపట్టినట్లు చెప్పారు. చర్మ
శ్వాస కోశ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి వైద్య సేవలు అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు అరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల తొలి దశలోనే వ్యాధిని గుర్తించడం ద్వారా దీర్ధకాలిక వ్యాధులను
కనిపెట్టడానికి, తమ ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి తమ సంపాదనలో వైద్య ఖర్చులు తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. తద్వారా ఆరోగ్యంతో పాటు వైద్య ఖర్చులు పరిరక్షించుకోవడానికి ముందస్తుచర్యలు తీసుకోగలుగుతారని చెప్పారు.
ముందస్తు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అన్నారు
వ్యాధిని ముందుగానే కనిపెట్టవచ్చునని అధునాతన వైద్య చికిత్సల కోసం సులభంగా ఆసుపత్రిలో చేరవచ్చునని అన్నారు.
పనిచేసే చోట ఉత్పాదకత పెరుగుతుందని. మెరుగైన జీవితం కోసం ఆరోగ్య సంరక్షణ క్షేమం సులభంగా పొందవచ్చునన్నారు. ప్రత్యేక శిబిరాల్లో
50 కి పైగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. వైద్య పరీక్షలు చేపించుకోవడానికి కార్మికులు తమ
ఆధార్ కార్డు, కార్మిక శాఖ జారీ చేసిన నిర్మాణ రంగ గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్మిక కమిషనర్ షర్ఫుద్దీన్, సి.ఎస్.సి హెల్త్ కేర్ జిల్లా కో ఆర్డినేటర్ షేక్ అక్బర్ అలీ, సి.ఎస్.సి. హెల్త్ కేర్ క్యాంప్ కో ఆర్డినేటర్ జి మహేష్ తదితరులు పాల్గొన్నారు.