మన్యం న్యూస్: జూలూరుపాడు, ఏప్రిల్ 21, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రాష్ట్రప్రభుత్వం 100 వసతి గృహాలను విద్యార్థులు లేరన్న కారణంతో మూసివేసే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి పవన్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకు దూరం అవుతారని, హస్టల్స్ మూసి దగ్గర ఉన్న గురుకులాలలో, హస్టల్స్ లో వీలీనం చేస్తామని చెప్పడం అంటే సంక్షేమ వసతిగృహాలకు నష్టం చేయడమేనని ప్రకటనలో తెలిపారు. విద్యార్ధులు చేరేలా ప్రభుత్వం పోత్సహించకుండా, విద్యార్ధులు 20 మంది కంటే తక్కువ ఉన్నారని మూసివేయడం సరికాదని, దళిత, గిరిజన, ఆదివాసీ విద్యార్ధులలో చదువుకు హస్టల్స్ సదుపాయాలు కల్పిస్తేనే చదువుకుంటారని, వలసలు వెళ్ళె వారి పిల్లలు, ఇతర పనులు చేసే తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కడైనా తమ ఊర్లో ఉంచి చదివించే అవకాశం ఉండదని అన్నారు.
మూసి వేత పేరుతో సంక్షేమానికి నిధులు తగ్గించి, పేద విద్యార్థులకు చదువును దూరం చేసే కుట్ర గా ఉందని వాపోయారు. వార్డెన్లు, నోట్ పుస్తకాలు, సరైన మెనూ, అదనపు గదులు, మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించకుండా విద్యార్ధులు లేరనే పేరుతో మూసి వేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు.