నేతల వరుస రాజీనామాలతో అధికార పార్టీలో కలవరం మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పీవీ కృష్ణారావు పట్టణ ఉపాధ్యక్ష పదవికి, పార్టీకి శనివారం రాజీనామా చేశారు. ఆయనతో పాటు పార్టీ ప్రచార కార్యదర్శి పదవికి హరిగోపాల్ శర్మ కూడా రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీలో సరైన ప్రాధాన్యం, గుర్తింపు లేకపోవడమే కారణంగా తెలుస్తోంది. కార్మిక సంఘాల సమస్యల కోసం యూనియన్ నేతగా అనేక పోరాటాలు చేసిన కృష్ణారావు గత ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపుకు విశేష కృషి చేశారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలలో కూడా చురుకుగా పనిచేసి క్రియాశీలకంగా వ్యవహరించారు. యూనియన్ నేతగా 21 రోజుల సకలజనుల సమ్మెలో కార్మికులను సంఘటితం చేసి సమ్మె విజయవంతం చేయటంలో కీలకభూమిక పోషించారు. ఆయనకు కార్మికులతో ఇప్పటికీ సత్సంబంధాలున్నాయి. ఈ మేరకు ఆయన రాజీనామాతో రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి కాస్త ఇబ్బంది కలగొచ్చనే అభిప్రాయాలు ప్రజల నుంచి వినపడతున్నాయి. గత నెలరోజుల్లో ముగ్గురు నేతలు పార్టీకి రాజీనామా చేయటంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పీవీ కృష్ణారావు మాట్లాడుతూ…గత ఇరవై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నేను పలు పార్టీలలో బాధ్యతాయుత పదవులలో కొనసాగానని 2015లో ఆనాడు కోరం కనకయ్య ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. ఆ తరవాత పలువురి ప్రవర్తన బాధించి భాజపాలో చేరి ప్రధాన కార్యదర్శిగా మరియు జిల్లాలోనూ క్రియాశీలకంగా వ్యవహరించానని పేర్కొన్నారు. భాజపాలో కేవలం మూడు నెలలు మాత్రమే పనిచేసిన నేను ప్రస్తుత ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సూచన మేరకు ఆమె హయాంలో ఇల్లందు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడిని అయి తిరిగి భారాసాలో చేరానని అన్నారు. కానీ అధికార పార్టీలో ప్రస్తుతం పనిచేసే నాయకులకు గుర్తింపు ఇవ్వటం లేదని ఆ కారణంగానే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తన సేవలను గుర్తించి పట్టణ ఉపాధ్యక్షునిగా, పార్టీ అధికార ప్రతినిధిగా గౌరవం, గుర్తింపు ఇచ్చారని ఈ సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అంటూ పేర్కొన్నారు. పార్టీకి రాజీనామా చేయటం తనకు ఇష్టం లేదని అదేవిధంగా ఎమ్మెల్యేతోనూ తనకు ఏ విధమైన విభేదాలు లేవని, కానీ పార్టీలో ఉన్న కొందరు చోటామోటా నాయకుల తీరు వల్లే తాను నేడు పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు. ఈ విషయమై అధినాయకులకు పలుసార్లు విన్నవించుకుని ఇన్నిరోజులు ఆగామని ఫలితం లేకపోవడంతో నేడు రాజీనామా లేఖను ఎమ్మెల్యే కార్యాలయానికి అందజేసినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమకాలంలో అనేక పోరాటాల్లో పాల్గొని జైలు జీవితం గడిపిన హారిగోపాల్ శర్మకు నామినేటెడ్ పోస్టుల్లో సైతం స్థానం కల్పించకపోగా వలసవాదులకు కట్టబెట్టి ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణచివేతకు గురైన తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడితే పేదోళ్ళ, నిరుద్యోగుల బతుకులు మారతాయని ఆకాంక్షించినవారిలో నేను ఒకడినని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భావ సారూప్యత, నైతికత ఉన్న పార్టీల్లో చేరి ఇల్లందు అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.
