మన్యం న్యూస్: జూలూరుపాడు, ఏప్రిల్ 22, శుక్రవారం నెలవంక కనిపించడంతొ ముస్లిం సోదరులు శనివారం రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నెల రోజులు ఉపవాసం ఉంటూ, రంజాన్ మాసపు ప్రత్యేక నమాజ్ లో పూర్తి ఖురాన్ ను పఠణం చేస్తూ ప్రత్యేక నమాజును చేశారు. రంజాన్ మాసంలో ముస్లింల పవిత్ర గ్రంథం అయిన ఖురాన్ అవతరించిందని విశ్వసిస్తారు. మత ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణలు పాటిస్తూ ఈ నెలలో అత్యంత పవిత్రమైన షబేఖదర్ రాత్రి జాగరణ చేస్తారు. రంజాన్ నెలలో ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటల తర్వాత ఉపవాస దీక్షలను విరమించి ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. శుక్రవారం నెలవంక కనిపించడంతో ఉపవాస దీక్షలను విరమించి శనివారం రంజాన్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. జామా మజీద్ మౌల్వి సాహెబ్ షేక్ ఆరిఫ్ ఈద్-ఉల్-ఫితర్ ప్రత్యేకతను వివరించారు. ప్రవక్తలు సూచించిన సన్మార్గంలో నడవాలని కోరారు. అనంతరం రంజాన్ పండుగ ప్రత్యేక నమాజ్ ఈద్గా వద్ద నిర్వహించారు.