మన్యం న్యూస్,ఇల్లందు టౌన్ …సిపిఐ ఎంఎల్ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు కామ్రేడ్ లెనిన్ 54వ జయంతిని పురస్కరించుకొని శనివారం ఇల్లెందులో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయం ముందు పార్టీ ఇల్లెందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు పార్టీ విప్లవ జెండాను ఎగురవేశారు. అదేవిధంగా స్టేషన్ బస్తీలో పార్టీ పట్టణ కార్యదర్శి కొక్కు సారంగపాణి, సత్యనారాయణపురంలో పార్టీ గ్రామ కార్యదర్శి రసాల లింగం పార్టీ జెండాలను ఎగురవేశారు. అనంతరం కామ్రేడ్ కొక్కుసారంగపాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎన్డి ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 1969 ఏప్రిల్ 22న లెనిన్ జయంతి సందర్భంగా రివిజనిస్టు విధానాలను వ్యతిరేకిస్తూ, పార్లమెంటరీ పందాను తిరస్కరించి భారత పీడిత ప్రజల విముక్తికి దీర్ఘకాలిక సాయుధ పోరాటపందానే సరైనమార్గమని భారత విప్లవకారులు సిపిఐ ఎంఎల్ పార్టీని స్థాపించారని తెలిపారు. నాటి నుండి నేటి వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేయటం జరిగిందన్నారు. ముఖ్యంగా దున్నేవానికి భూమి లక్ష్యంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి లక్షలాది ఎకరాల భూములను, పోడు భూములను పేద ప్రజలకు తమపార్టీ సాధించిపెట్టిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో నాటిబత్తుల వెంకటేశ్వరరావు నుండి మొదలుకొని నిన్నటి పూనేం లింగన్న వరకు అనేకమంది కమ్యూనిస్టు విప్లవ యోధులు బూటకపు ఎన్కౌంటర్లో వేలాదిమంది విప్లవకారులు తమ ప్రాణాలను బలిదానం చేశారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే, భారత ప్రజల విముక్తికి, నూతన ప్రజాస్వామిక విప్లవలక్ష్యం కోసం దీర్ఘకాలిక ప్రజాయుద్ధపందా మార్గంలో ప్రతిఘటన పోరాట అవగాహనతో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పట్టణ నాయకులు తోడేటి నాగేశ్వరరావు, గూళ్ల సదయ్య, కొరస రమేష్, రామిశెట్టి నరసింహారావు, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి ఇరుప రాజేష్, నాయకులు తేజావతు లాలు, ఎల్. ధనంజయ, వెంకటేశ్వర్లు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.