మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:ఎనిమిది గంటల పని విధానం కోసం, కార్మికహక్కుల కోసం ఆనాడు ప్రాణాలర్పించిన చికాగో అమరవీరుల స్ఫూర్తితో కార్మిక చట్టాల పరిరక్షణకు ఉద్యమాలు నిర్వహించాలని సిపిఐ రాష్ట్రసమితిసభ్యులు కె సారయ్య పిలుపునిచ్చారు. శనివారం స్థానిక విఠల్ రావు భవన్లో మేడే సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మేడే ఉత్సవాలను ఘనంగా కార్మిక అడ్డాలలో, వాడవాడన నిర్వహించాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పోరాడి ప్రాణాల అర్పించి సాధించుకున్న 44 కార్మికచట్టాలను నాలుగు చట్టాలుగా చేసి కార్మికులను బానిసలు చేసే కుట్ర చేస్తుందని ఈ కుట్రను తిప్పికొట్టేందుకు మే డే స్ఫూర్తితో పోరాటాలకు సంసిద్ధం కావాలని పేర్కొన్నారు. దేశ సంపదను అప్పనంగా తన సన్నిహితులకు, కార్పోరేట్ వ్యక్తులకు దోచిపెడుతున్న మోడీకి కార్మికవర్గ పోరాటాలతో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పాలన కొనసాగిస్తున్న బిజెపికి కాలం దగ్గరపడిందని కార్మికులను, ప్రజలను మరింత చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని అన్నారు. మేడే రోజున ఇల్లందులోని అన్ని మైన్స్, డిపార్ట్మెంట్లలో యాభై కేంద్రాలలో మేడే ఉత్సవాలు నిర్వహించబోతున్నట్లు, కార్మికుల సత్తా ఏంటో పాలకులకు కనువిప్పు కలిగే విధంగా పెద్ద ఎత్తున మేడే నిర్వహించాలని సారయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దేవరకొండ శంకర్, ఎఐటియుసి డివిజన్ కార్యదర్శి ఎండి నజీర్ అహ్మద్, ఫిట్ కార్యదర్శులు కొడెం సుందర్, పాపారావు, మంచాల వేంకటేశ్వర్లు, సంజీవ చారి, ఆఫీస్ ఇంచార్జి వడ్లకొండ పొచయ్య, బజారు ఆంజనేయులు, శంషుద్దిన్, రమేష్, వళి, వల్లాల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.