రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాది పూర్తై ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తూర్పున ఉన్న నాలుగు కీలక ప్రాంతాలను తనలో కలిపేసుకుంది.
జపొరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ ప్రాంతాలను ఆక్రమించుకుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చెర్నోబిల్ అణు కర్మాగారం వద్ద కందకాలు తవ్విన రష్యా సైనికులు రేడియషన్ బారినపడి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్ 1986లో పేలిపోయింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం నిషిద్ధ ప్రాంతంగా మారింది.
చెర్నోబిల్ విపత్తు తరువాత, రసాయన నిపుణుల బృందాలు కలుషితమైన మట్టిని త్రవ్వి అక్కడి రెడ్ ఫారెస్ట్‌లో భూమి క్రింద పాతిపెట్టడానికి పెట్టారు. రెేడియేషన్ అక్కడి పరిసరాల్లోకి వ్యాపించడంతో అటువైపుగా జనాలు వెళ్లకుండా 37 ఏళ్లకుపైగా నిషేధం కొనసాగుతోంది. అయితే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ ప్రాంతంలోకి రష్యా సైన్యం చొచ్చుకు వెల్లింది. దాదాపుగా 5 వారాల పాటు చెర్నోబిల్ ఏరియాలోనే రష్యా సైనికులు ఉన్నారు. దీంతో వారు రేడియేషన్ బారిన పడినట్లు తెలుస్తోంది.
1986 ఏప్రిల్ 26న అప్పటి సోవియట్ యూనియన్ లో ఉన్న చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరిగింది. అర్థరాత్రి దాటిన తర్వాత 1.23 గంటలకు విద్యుత్ కేంద్రం భద్రతను పర్యవేక్షించేందుకు చేపట్టిన ప్రయోగం విఫలం కావడంతో ఈ పేలుడు సంభవించింది. అణురియాక్టర్ లోని నాలుగో నంబర్ యూనిట్ లో విద్యుత్ సరఫరా ఆపేశారు. ఈ పనిచేయడానికి ముందే రియాక్టర్ సరిగ్గా పనిచేయడం లేదని ఇంజనీర్లు గుర్తించలేదు.
కరెంట్ నిలిచిపోవడంతో రియాక్టర్ కు నీటిని సఫ్లై చేసే టర్బైన్స్ ఆగిపోయాయి. ఫలితంగా రియాక్టర్లలో పీడన పెరిగి ఒక్కసారిగా పేలిపోయింది. అప్పటికే రియాక్టర్ ని నిలిపేద్దాం అనుకున్నప్పటికీ ఆలస్యం జరిగిపోయింది. ఈ దుర్ఘటన కారణంగా చెర్నోబిల్ ప్రాంతం నుంచి 2.34 లక్షల మంది ఆ ప్రాంతాన్ని వదిలివెళ్లారు. రేడియేషన్ వల్ల 47 మంది చనిపోయారు.