UPDATES  

 రైతులు అధైర్యపడొద్దు, తడిచిన ధాన్యాన్ని కొంటాం.. మంత్రి గంగుల హామీ

ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా తెలంగాణ రైతులకు తీరని నష్టం వాటిల్లింది. కుండపోత వానల వల్ల వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

ధాన్యం పూర్తిగా తడిసిముద్దైంది. ఈ నేపథ్యంలోనే రైతులు ఆందోళన చెందుతుండగా.. మంత్రి గంగుల కమలాకర్ వారికి ఊరట కల్పిస్తూ కీలక ప్రకటన చేశారు. ధాన్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిచిన ధాన్యాన్ని తాము కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మే 2వ తేదీ మంగళవారం కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్, దుర్శేడు, గోపాల్ పూర్, చేగుర్తి గ్రామాల్లో పంట నష్టాలను పరిశీలించిన ఆయన.. రైతులు అధైర్య పడొద్దని, ధాన్యం తప్పకుండా కొంటామని చెప్పారు.

 

అనంతరం మీడియాతో మాట్లాడిన గంగుల కమలాకర్.. గతంలో ఎప్పుడూ లేని విధంగా నష్టం వాటిల్లిందని, వందేళ్లలో ఇంతటి పంట నష్టం ఎప్పడూ జరగలేదని అన్నారు. గతంలో అకాల వర్షాల కారణంగా 10 నుంచి 30 శాతం వరకు మాత్రమే నష్టం జరిగేదని.. కానీ ఈసారి వందకు వంద శాతం పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. చేతికొచ్చిన పంట నేలపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టం కలిగిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇస్తున్నామని స్పష్టం చేశారు. సివిల్ సప్లై ఆధ్వర్యంలో.. కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చిన ప్రతి ధాన్యం గింజని కొంటామన్నారు. తడిచిన ధాన్యం ఆరబెట్టి తెస్తే చాలని.. ఎలాంటి కోతలు లేకుండా కొంటామని తెలిపారు. కొందరి పంట కోయకముందే రాళ్ల వానలకు నేలపాలైందని.. అలాంటి రైతులను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా కల్పించారు. తేమ శాతాన్ని సడలించాలని తాము ఎఫ్‌సీఐని కోరామని.. వాళ్లు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !