- వీఓఏలకు రూ.26వేల వేతనం చెల్లించాలి
- వీఓఏలతో ఊడిగం చేయించుకుంటున్న ప్రభుత్వానికి
- వారి సమస్యలు పట్టవా
- ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థలు పనిచేస్తున్న ఐకేసీ వీఓఏలను సెరు ఉద్యోగులుగా గుర్తించాలని, అప్పటి వరకు రూ.26వేల కనీస వేతనం చెల్లించాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారంకోరుతూ వీఓఏలు బస్టాండ్ సెంటర్లో చేపట్టిన నిరసన దీక్షలు గురువారం నాటికి 18వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలను నరాటి సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఐకేపీ, విఓఏలు రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా, చర్చలకు ఆహ్వానించకుండా మొండిగా వ్యవహరిస్తోందన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థలో రాష్ట్ర వ్యాప్తంగా 18వేల మంది వీవోఏలు గ్రామ సంఘాలకు సహాయకులుగా పనిచేస్తున్నారని, 19 ఏండ్లుగా ప్రభుత్వాలకు ఊడిగం చేస్తున్నప్పటికి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరైందికాదన్నారు. కేవలం రూ.8,900వేతనం మాత్రమే చెల్లించి చేతులు దులుపుకుంటున్నారని, ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకోసం ఎనిమిదిన్నరేళ్ళుగా ఎదురుచూస్తున్నారన్నారు. వీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు రూ.10లక్షల ప్రమాద భీమా సైకర్యం కల్పించాలని, సెర్చ్ సంస్థ నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, గ్రేడింగ్ విధానం రద్దు చేసి నేరుగా వారి ఖాతాలో వేతనాలు జమచేయాలని డిమాండ్ చేశారు. వీఓఏలకు ఏఐటియుసి అండగా ఉంటుందని ప్రభుత్వం స్పందించుంటే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కంచర్ల జమలయ్య తదితరులు ఉన్నారు.