మన్యం న్యూస్ చండ్రుగొండ మే 04: మండల పరిధిలోని తుంగారం పంచాయితీ లో వరుసగా రెండో పాడి ఆవు విద్యుత్ షాక్ తో మృతి సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. బాధిత రైతు, గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… తుంగారం గ్రామపంచాయతీలో కొన్ని రోజుల క్రితం గ్రామానికి సంబంధించిన ఆంబోతు ఎద్దు మేతమేస్తూ ఇలానే విద్యుత్ ట్రాన్స్ఫార్మ్ వైర్ కు తగిలి విద్యుత్ షాక్ తో మృతి చెందిందని, అయినా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు పాడి ఆవు మేతమేస్తూ ట్రాన్స్ఫార్మర్ వైరుకు విద్యుత్ సరఫరా కావడంతో మృతి చెందిందని, టేకులబంజర గ్రామానికి చెందిన బాధిత రైతు బర్మావత్ సామా ఆవేదన వ్యక్తం చేశారు. నా పాడి ఆవు మృతి చందడానికి కారణం అయిన విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని, దానికి నష్టపరిహారం కట్టించాలని ఆయన డిమాండ్ చేశారు. తుంగారం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ కుమారి మాట్లాడుతూ… గ్రామపంచాయతీలో విద్యుత్ శాఖ అధికారులు, ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ వైర్లే కాకుండా, గ్రామంలో కూడా విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతున్నాయని, ఈరోజు పశువులే కావచ్చు, రేపు మనుషులు అయితే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు గ్రామ పంచాయతీలో ఉన్న విద్యుత్ వైర్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే పై అధికారులు, స్థానిక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రామస్తులు, తోటి రైతులు, బాధిత రైతు బర్మావత్ సామా నష్టపరహారం అందేలా చూడాలని అధికారులను డిమాండ్ చేశారు.