మన్యంన్యూస్,ఇల్లందు టౌన్ ..సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సీనియర్ నాయకురాలు, ఇల్లందు పట్టణ కమిటీ సభ్యురాలు, ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యు) జిల్లా నాయకురాలు కామ్రేడ్ దండు వెంకటక్క గత కొంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతూ శనివారం ఉదయం స్టేషన్ బస్తీలోని తన స్వగృహంలో మృతి చెందారు. ఈ సందర్భంగా కామ్రేడ్ వెంకటక్క మృతదేహన్ని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి పొడుగు నర్సింహారావు, ఇఫ్టు జిల్లా అధ్యక్షులు తోడేటి నాగేశ్వరరావు సందర్శించి నివాళులు అర్పించారు. కామ్రేడ్ వెంకటక్క తన జీవితాంతం పేదల పక్షాన నిలిచి పోరాడారని, ముఖ్యంగా ఇల్లందు పట్టణం స్టేషన్ బస్తీలో ఇండ్లు లేని పేదలకు పక్కా ఇళ్లు మంజూరు చేయించి, కాలనీకి మంచినీరు, విద్యుత్తు, అంతర్గత రహదారులు లాంటి అనేక సౌకర్యాలను కల్పించడానికి అలుపు లేని పోరాటం చేసిందని అన్నారు. అలాగే మహిళా సమస్యలపై, న్యూడెమోక్రసీ రహస్య పార్టీ నిర్మాణానికి ఎంతగానో సహకరించిన ధైర్యవంతురాలని తెలిపారు. వెంకటక్కతో పాటు తన కుటుంబసభ్యులు కూడా పార్టీ అభివృద్దికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. అనంతరం వెంకటక్క భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి, పూల మాల వేసి నివాళులర్పించారు. కామ్రేడ్ వెంకటక్కకు విప్లవ జోహార్లు తెలిపారు. అదేవిధంగా తన కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఎఐకేఎంఎస్ మండల కార్యదర్శి బొగ్గారపు సంగయ్య, మోటార్ వర్కర్స్ యూనియన్ బ్రాంచి అధ్యక్షులు పల్లి సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే యాకూబ్ అలి, జిల్లా నాయకులు ఎల్.రాజు, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు కొక్కూ ఉమారాణి, నాయకులు పులిమామిడి శ్రీను తదితరులు సంఘీభావం తెలిపారు.
