*ఆశీర్వదించండి ప్రజాసేవకై నేను సైతం
ఇల్లందు ఎమ్మెల్యే బరిలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు బానోత్ విజయలక్ష్మి* సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన విజయలక్ష్మి మన్యంన్యూస్,ఇల్లందు: మహిళ అయితే కేవలం ఇంటికే పరిమితం అనుకునే పరిస్థితుల్లో అటు ఇంటిని చూసుకుంటూ, ఇటు రాజకీయాల్లోనూ చురుకుగా ఉంటూ రెండు పాత్రలకు న్యాయం చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు బానోత్ విజయలక్ష్మి. ఇల్లందు నియోజకవర్గానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబాబాద్ లోని తండధర్మారం గ్రామంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన గుగులోత్ లింబానాయక్, సోనాబాయి దంపతులకు 1976 ఆగస్ట్ 15న మొదటి సంతానంగా విజయలక్ష్మి జన్మించారు. తండధర్మారం గ్రామంలో పుట్టినప్పటికీ బయ్యారంలోని అమ్మమ్మ దగ్గరే పెరిగారు విజయలక్ష్మి. వ్యవసాయమే జీవనాధారం అయినప్పటికీ తండ్రి మాత్రం విజయలక్ష్మి చదువుకు పూర్తి సహకారం అందించేవారు. తండ్రి ప్రోత్బలంతో హైస్కూల్ వరకు చదువుకున్న ఆమె వ్యవసాయంలో తీవ్ర నష్టం రావడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా పై చదువులకు వెళ్ళలేకపోయారు. ఈ నేపథ్యంలో పాల్వంచ పాండురంగాపురానికి చెందిన బానోత్ కిషన్ నాయక్ తో 1989లో విజయలక్ష్మి వివాహమైంది. కిషన్ నాయక్ తండ్రి, తాతలు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులుగా ఉంటూ సర్పంచ్ గా దశాబ్దాలపాటు సేవలందించారు. పదవీ ఉన్నా లేకున్నా కాంగ్రెస్ లోనే ఉంటూ పాల్వంచ, ఇల్లందు నియోజకవర్గాల్లో తమ దృష్టికి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించటంలో ముందుండేవారు. ఈ నేపథ్యంలో రాజకీయాలపై మక్కువ పెరగటంతో కేటీపీఎస్ లో ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తూనే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు కిషన్ నాయక్. భర్త చేసే ప్రతీపనిలో చేదోడువాదోడుగా ఉంటూనే తనకు ఇష్టమైన విద్యను కొనసాగించి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు విజయలక్ష్మి. అనంతరం భర్త ప్రోత్సాహంతో ప్రాక్టీస్ మొదలుపెట్టి మెడికల్ షాప్ నిర్వహణ చూసుకునేవారు. కిషన్ నాయక్, విజయలక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం కాగా అందులో ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. ఆడపిల్లలే అని చులకనగా చూడకుండా మగ పిల్లాడితో సమానంగా ఎంబీబీఎస్ చదివించి డాక్టర్లుగా తీర్చిదిద్దారు. కూతుర్లు బిందుపల్లవి, సిందుపల్లవిలు పీజీ గ్రాడ్యుయేషన్ పట్టా కూడా కలిగి ఉండటం విశేషం. కొడుకు రామ్ చరణ్ నాయక్ ఖమ్మంలోని మమత మెడికల్ కళాశాలలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడాలనే తలంపుతో కొత్తగూడెంలో బిందుపల్లవి మల్టీస్పెషాలిటీ పేరుతో ఆసుపత్రిని ప్రారంభించి వారంలో మూడురోజుల పాటు ఉచిత సేవలను అందిస్తున్నారు. అదేవిధంగా హెల్త్ క్యాంపులను సైతం నిర్వహిస్తూ అనేక సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కిషన్ నాయక్ చేసిన సేవలను గుర్తించిన అధినాయకత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, జాయింట్ సెక్రటరీగా నియమించింది. భర్తతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో విజయలక్ష్మి చురుకుగా పాల్గొని పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. విజయలక్ష్మికి చిన్నతనం నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉండేది. తండ్రి ముప్పైఏళ్ల క్రితమే జెడ్పీటీసీగా పనిచేయటం, అనేక పర్యాయాలు గెలిచి ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించి కార్యకర్తలను సొంతమనుషులుగా చూడటం ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇల్లందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీకి సిద్దంగా ఉన్నట్లు బానోత్ విజయలక్ష్మి పేర్కొన్నారు. గతకొంతకాలంగా ఇల్లందు నియోజకవర్గంలో బిందుపల్లవి మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో అనేక హెల్త్ క్యాంపులను నిర్వహిస్తూ ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఆర్థికంగా స్తోమత లేని రోగులకు సొంతడబ్బుతో ఉన్నత ఆసుపత్రులలో చేర్పించి వారి ఆరోగ్యం కుదుటపడే వరకు అన్నిరకాల సౌకర్యాలను కల్పిస్తూ వారి కుటుంబాల్లో వెలుగును నింపుతున్నారు. అంతేకాకుండా ఆపదలో ఉన్నవారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. అదేవిధంగా పైచదువులు చదవాలని ఉన్న స్తోమతలేని విద్యార్థులకు ఆర్థికసాయాన్ని చేస్తూ ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ విజయలక్ష్మి భరోసా కల్పిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో నిలిచేందుకు సై అంటున్న విజయలక్ష్మి మాట్లాడుతూ…దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన తమ కుటుంబ సేవలను గుర్తించి తనకు ఇల్లందు టికెట్ కేటాయిస్తే ప్రజలకు మరింత సేవచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తా అని పేర్కొన్నారు. నియోజకవర్గంలో గిరిజన లంబాడా తెగకు చెందినవారు అధికంగా ఉండటంతో కాంగ్రెస్ బరిలో ఉన్న విజయలక్ష్మికి కలిసివచ్చే అవకాశాలు మెండుగా ఉన్నట్టు తెలుస్తోంది.
