మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 10: జీతాలు లేకుండా పనిచేయలేమని, మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎలా బ్రతకాలని, జీతాలు చెల్లించే వరకు పనులు చేయబోమని, చెత్త ఎత్తం, నీళ్లు వదలం అంటూ ఆసుపాక గ్రామపంచాయతీ వర్కర్లు తమ విధులను బహిష్కరించారు. రెక్కాడితే గాని డొక్కాడని మాకు ఇన్ని నెలలు జీతాలు పెండింగ్లో పెడితే ఎలా ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలంటూ అసుపాక గ్రామపంచాయతీ వర్కర్లు మొరపెట్టుకున్నారు. గ్రామపంచాయతీ సర్పంచ్, కార్యదర్శి లు బిల్లులు చేసి మండల పరిషత్ కార్యాలయానికి పంపించినప్పటికీ బిల్లులు చేయొద్దని ఆపుతున్నట్లు వారు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మీకు సవా లక్ష రాజకీయాలు ఉంటే మీరు చూసుకోండి, మా కడుపులు కొట్టొద్దు అంటూ వారు వేడుకుంటున్నారు. వెంటనే మండల పరిషత్తు అధికారులు తగు చర్యలు తీసుకొని మాకు జీతాలు ఇప్పించాలని వారు కోరుతున్నారు.