- జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను గోసపెట్టొద్దు
- క్రమబద్దీకరణ ప్రక్రియ తక్షణమే చేపట్టాలి
- డిహెచ్ఎఎస్ రాష్ట్ర అధ్యక్షులు బందెల నర్సయ్య
- సిపిఐ ఆధ్వర్యంలో దీక్షల శిభిరంలో భోజనం పంపిణి
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను గోసపెట్టొద్దని, తక్షణమే వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి సమ్మెను నివారించాలని సిపిఐ అనుబంద దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బందెల నర్సయ్య, సిపిఐ జిల్లా సమితి సభ్యులు, చుంచుపల్లి వైస్ ఎంపిపి వట్టికొండ మల్లికార్జున్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శులు చేపట్టిన దీక్షల శిభిరాన్ని సందర్శించిన అనంతరం సిపిఐ ఆద్వర్యంలో భోజన పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం జూనియర్, ఔట్ సోర్సింగ్ కార్యదర్శులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఉద్యోగ కాలపరిమితి పూర్తయిన తర్వాత కూడా వారిని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించకుండా వారితో ఊడిగం చేయించుకోవడం బాధాకరమన్నారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, గ్రామాల అభివఋద్ది వంటి అంశాల్లో తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు జాతీయ స్థాయిలో అవార్డులు వస్తున్నాయని చెప్పుకుంటున్న ప్రభుత్వం అందుకు ప్రధాన కారకులైన పంచాయతీ కార్మికుల సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. గ్రామాల్లో జరిగే నర్సరీలు, వూకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం, పల్లు ప్రకృతివనాలు, రైతు వేదికలు, క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రగతి, హరితహారం, స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాల అమలులో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పాత్ర క్రీయాశీలమని ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. క్రమబద్దీకరణతోపాటు వారికి పేస్కేలు అమలు చేయాలని, పర్మనెంట్ కార్యదర్శులతో సమానంగా అన్ని హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుండా కాలాయాపన చేస్తే కార్యదర్శుల పక్షాన దశలవారి ఆందోలనలకు పూనుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఏర్వ రాంచందర్, తోట రాజు తదితరులు పాల్గొన్నారు.