- అభివృద్ధి పేరుతో పేదలను నిర్వాసితులను చేయొద్దు
- ప్రజల అభిష్టం మేరకు రోడ్డు విస్తరణ చేపట్టాలి
- సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా
- ప్రతిగతినగర్ లో పర్యటించిన నేతల బృందం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
అభివృద్ధి పేరుతో విధ్వంసానికి పాల్పడుతూ పేదలను నిర్వాసితులను చేయడాన్ని సహించబోమని, ప్రజల అభిష్టం మేరకు రోడ్డు విస్తరణ చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.సాబీర్ పాషా డిమాండ్ చేశారు. కొత్తగూడెం పట్టణంలోని ప్రగతినగర్ రోడ్డు విస్తరణ ప్రాంతంలో బుధవారం సిపిఐ బృందం పర్యటించి బాదితులను కలుసుకొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ అభివృద్దిని ఎవరూ అడ్డుకోరని, ఐతే ఆ అభివృద్ధి పేద్రజలను రోడ్డుపాలు చేసే విదంగా ఉందన్నారు. 30 ఫీట్ల మేరకే రోడ్డు విస్తరణ చేపట్టాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని, మున్సిపాలిటీలో ఏకపక్షంగా చేసిన తీర్మాణంతో 40 ఫీట్ల రోడ్డు విస్తరణ చేపడితే వందలాది ప్రజలు తమ ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మారే ప్రమాదం ఏర్పడుతుందని, ఆరు వార్డుల పరిధిలో చేపడుతున్న ఈ రోడ్డు విస్తరణ వల్ల పేదలకు అన్యాయం జరుగుతుందన్నారు. 30 పీట్లకే రోడ్డు విస్తరణ పరిమితం చేస్తామని హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే పనులు ప్రారంభమైనప్పటికి నోరుమెదపకపోవడం వెనుక ఆంతర్యమేమంటని ప్రశ్నించారు. రోడ్డు విస్తరణ బడాబాబుల ఇండ్లను కాపాడుతూ పేదల ఇండ్లను కూల్చివేస్తూ జరుగుతుందని ఆరోపించారు. పేదలకు జరుగుతున్న అన్యాయంపై జిల్లా కలెక్టర్ స్పందించాలని పేదలకు న్యాయం చేయాలని కోరారు. పర్యటనలో 18వ వార్డు కౌన్సిలర్ పి. సత్యనారాయణచారి, స్థానికులు పరమేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.