మన్యం న్యూస్ వాజేడు
ములుగు జిల్లా వాజేడు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన పూణే శ్రీనివాస్, రమాదేవి దంపతులకు కొడుకు, పూనెం సాయి తేజ (26) అకాల మరణం చెందారు. మండలంలో రిపోర్టర్ గా పనిచేస్తున్న సాయి తేజ మండల ప్రజలకు సుపరిచితుడు. గతవారం జ్వరం రావడంతో హనుమకొండ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం మధ్యాహ్నం సమయంలో మృతి చెందాడు.
ఆదుకున్న జర్నలిస్ట్ మిత్రులు
ఆర్థికంగా వెనుకబడి ఉన్న సాయి తేజ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న తెలంగాణ ప్రెస్ క్లబ్ వాజేడు అధ్యక్ష, కార్యదర్శులు స్పందించిన తీరు అమోఘం. సాయి తేజ చికిత్సకు అత్యవసరంగా లక్ష రూపాయలు అవసరమవడంతో ప్రెస్ క్లబ్ సభ్యులు, అధికారులు కలిపి ముప్పై వేలు విరాళాలు సేకరించి సాయి తేజ వైద్యానికి తన తండ్రికి అందించారు. మరో లక్ష రూపాయలు తెలిసిన వారి వద్ద తీసుకొచ్చి సాయితేజ తల్లికి అందించారు. సాయి తేజను బ్రతికించడానికి చేసిన ప్రయత్నాలు విపలమవడంతో తోటి జర్నలిస్టులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సరదాగా తమతో గడిపిన సాయి లేడు అన్న విషయాన్ని తోటి జర్నలిస్టులు జీర్ణించుకోలేకపోయారు.
జర్నలిస్టులకు ప్రజల ప్రశంసలు
రిపోర్టర్ గా పనిచేస్తున్న సాయి తేజ ఆర్థిక పరిస్థితి తెలిసిన తోటి జర్నలిస్టులు ముప్పై వేలు సేకరించి సాయి తేజ తల్లిదండ్రులకు అందించడమే కాకుండా సాయి తేజ మరణ వార్త విని దహన సంస్కారాలకు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసిన జర్నలిస్టులను అధికారులు, ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, మండల ప్రజలు అభినందించారు.
