మన్యంన్యూస్ ఇల్లందురూరల్: ఆదివాసీలకు అస్థిత్వ రక్షణకై, పర్యావరణ, జీవావరణ పరిరక్షణకు మే 21న విశాఖపట్నంలో జరుగుతున్న అఖిల భారత ఆదివాసి సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ అఖిలభారత ఆదివాసీ ఫోరం శనివారం ఇల్లందు మండలం మిట్టపల్లి గ్రామంలో గోడపత్రికల ఆవిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమంలో అఖిలభారత ఆదివాసీ ఫోరం స్టీరింగ్ కమిటీ నాయకులు సువర్ణపాక నాగేశ్వరరావు మాట్లాడుతూ, తరతరాలుగా ఆర్థిక దోపిడీకి, సామాజిక అణిచివేతకు, అభివృద్ధి ఆమడ దూరంగా ఆదివాసీలను నిలిపివేశారని, తీవ్రమైన పేదరికం వెనుకబాటుతనానికి గురి చేశారని అన్నారు. ఆర్ఎస్ఎస్-బిజెపి ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాలను రద్దుచేసి నూతన అటవీ హక్కుల చట్టాలు-2022 తీసుకువచ్చి ఆదివాసీలను పూర్తిగా అడవి నుంచి గెంటివేయడానికి పూనుకున్నారని, ఇదంతా కేవలం బడా పెట్టుబడిదారీ కార్పొరేట్ వ్యవస్థలకు అడవిని, అడవిలో ఉన్నటువంటి అడవి సంపదను కట్టబెట్టరని విమర్శించారు. ఇటువంటి తరుణంలో గిరిజన,ఆదివాసీలు అందరూ ఏకమై తిరుగుబాటు చేయాలని దానికై మే 21న విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం బిర్సముండా హాల్ డాబా గార్డెన్స్ నందు జరుగుతున్న అఖిలభారత ఆదివాసి సదస్సును ఆదివాసి గిరిజనులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు.