*
మన్యం న్యూస్,ఇల్లందు..పట్టణంలోని స్థానిక రాజీవ్ భవన్ నందు ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి రవి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించడం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు పార్టీ శ్రేణులతో కలిసి స్థానిక గోవింద్ సెంటర్ నుంచి రాజీవ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించి, బాణసంచా కాల్చారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులకు, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్ రవి మాట్లాడుతూ…ఈ విజయం ముమ్మాటికి రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర వల్లే సిద్ధించిందని ఆయన తెలిపారు. కర్ణాటక ప్రజలు హామీల అమలులో విఫలమైన బిజెపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపారని, ఇంతటి ఘనవిజయానికి పాటుపడిన కెపిసిసి చీఫ్ డీకే శివకుమార్, కర్ణాటక సిఎల్పి నేత సిద్ధరామయ్య లకు వారు కృతజ్ఞతలు తెలియచేశారు. ఇదే విధంగా తెలంగాణలో కూడా రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కల నాయకత్వంలో ప్రజలు నిరంకుశ, అప్రజాస్వామిక, అవినీతి పరిపాలన సాగిస్తున్న బిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని.. తద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రానున్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంతో పాటు ఇల్లందు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాణాల శ్రీనివాసరావు, పసికతిరుమల్, మాజీ కౌన్సిలర్ ధారావత్ కృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ బిఎన్ గోపాల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ మహిళా కార్యదర్శి కమల, పట్టణ కాంగ్రెస్ కమిటీ బీసీ సెల్ అధ్యక్షులు ఆనంద్, ఇల్లందు నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అరవిందస్వామి, పంచాయతీ పరిషత్ చైర్మన్ ఎండి ఇబ్రహీం, సూరజ్ , ఐఎన్టియుసి నాయకులు వర్మ, ఖాదర్ బాబు, సత్యనారాయణ, రవి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
