మన్యం న్యూస్,ఇల్లందు…ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఓసీలలో పనివేళలు మార్చాలని బీఎంఎస్ కార్మికసంఘం ఇల్లందు బ్రాంచ్ ఉపాధ్యక్షులు సైదులు తెలిపారు. ఈ నేపథ్యంలో పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ…సాధారణంగానే సింగరేణి ఉపరితల గనుల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా ఉంటాయని, ప్రస్తుతం వేసవి కావటంతో ఎండ తీవ్రత కారణంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయన్నారు. వేసవి వచ్చిందంటే కార్మికుల పనివేళల్లో యాజమాన్యం ప్రతిఏటా మార్పులు చేస్తుందని కానీ నేడు వేసవి మొదలై దాదాపు రెండు నెలలు దాటినప్పటికీ ఇంకా పనివేళలు మార్చకపోవడం దారుణమన్నారు. భానుడి ప్రతాపానికి ఓసీల్లో పనిచేసే కార్మికులు అల్లాడిపోతున్నారు అని పేర్కొన్నారు. కార్మికులకు అందించే మజ్జిగ ప్యాకెట్లలో నాణ్యతా ప్రమాణాలు లేవన్నారు. బ్రాండెడ్ మజ్జిగ ప్యాకెట్లను అందించాలని, ఓసీలలో వాటర్ స్ప్రే మరింతగా చేయించాలని, ఉద్యోగుల పనివేళలు మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ తగలటం, అదేవిధంగా ఆరోగ్యం సరిగాలేని కార్మికుల ఆరోగ్యాలకు ప్రమాదం వాటిల్లే పరిస్తితి ప్రస్తుతం ఇల్లందు ఏరియాలో నెలకొందని యాజమాన్యం ఇకనైనా కార్మికుల సమస్యలపై స్పందించి తగుచర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో బీఎంఎస్ ఆధ్వర్యంలో కార్మిక పోరాటాలకు సిద్దమని యాజమాన్యాన్ని ఆయన హెచ్చరించారు.
