- రంగంలోకి దిగిన డైనమిక్ లీడర్ మడత* దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్దమని వెల్లడి
- దసరా ఉత్సవాల నిర్వహణ కొరకు డోర్నకల్ బిషప్ పద్మారావును అనుమతి కోరిన మడత వెంకట్ గౌడ్
మన్యం న్యూస్,ఇల్లందు:దసరా ఉత్సవాలను మళ్లీ తానే నిర్వహిస్తానని, ఈసారి కనీవినీ ఎరుగని రీతిలో దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపిస్తానని డైనమిక్ లీడర్, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మెన్ మడత వెంకట్ గౌడ్ వెల్లడించారు. ఈ సందర్భంగా దసరా ఉత్సవాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలని డోర్నకల్ బిషప్ రెవ పద్మారావును మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్ అభ్యర్ధించారు. సిఎస్ఐ మిషనరీ స్కూల్ గ్రౌండ్లో సువార్త ఉజ్జీవ మహాసభల ముగింపు సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ…క్రైస్తవుల కుటుంబాల్లో గత 30 సంవత్సరాలుగా నేనూ ఒక కుటుంబసభ్యుడిగా మెలుగుతూ వచ్చానని, వారి సాధక బాధకల్లో తోడునీడగా ఉండి ప్రేమాభిమానాలు పొందటం ఆనందంగా ఉందని తెలిపారు. సీఎస్సై చర్చికి తన సొంత డబ్బులతో అనేక పనులు చేయించానని, పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసమే నా జీవితం అంకితం అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రతీ ఏడాదిలానే చర్చి కమిటీసభ్యులకు 25వేల రూపాయల చెక్కును అందించటం సంతోషంగా ఉందన్నారు. కులమతాలకు అతీతంగా గత ఎన్నోఏళ్ల నుండి దసరా ఉత్సవాలకు మిషనరీ స్కూల్ గ్రౌండ్ వేదికగా మారిందన్నారు. పాలకుల లోపమా, అధికారుల లోపమా తెలియదు కానీ గత సంవత్సరం దసరా ఉత్సవాలు ఇక్కడ నిర్వహించుకోలేదన్నారు. బొగ్గుట ఏర్పడిన దగ్గర్నుండి మిషనరీ స్కూల్ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు, షావలు కొలువుతీరుతూ అన్ని వర్గాల ప్రజలు పండుగను ఘనంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందన్నారు. నా హయాంలో ఏ లోటూ లేకుండా ఘనంగా దసరా ఉత్సవాలు జరిపించానని భావిస్తున్నా అని, మరోమారు అవకాశం ఇస్తే మిషన్ స్కూల్ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా జరిపిస్తా అని తెలియజేశారు. తండ్రిలాంటి బిషప్ పద్మరావును నేను కోరేది ఒక్కటే దసరా ఉత్సవాలను అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జరుపుకునేందుకు నిర్ణయం తీసుకొని అనుమతి ఇవ్వాలని విన్నవించుకుంటున్నానని పేర్కొన్నారు. అనంతరం బిషప్ పద్మారావు దంపతులను మడత దంపతులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మడత స్వయంగా రంగంలోకి దిగి దసరా ఉత్సవాలను మళ్లీ నిర్వహిస్తానని తెలపడంతో నియోజకవర్గ ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రూప్ చైర్మన్ ఫ్రాంక్లిన్, గ్రూప్ సెక్రటరీ అగస్టిన్ ప్రేమ్ రాజ్, ట్రెజరర్ తోకల యేసు రత్నం తదితరులు పాల్గొన్నారు.
