మన్యం న్యూస్,ఇల్లందు..ఇల్లందు ఏరియా సింగరేణి 47 ఫిల్టర్ బెడ్ నందు గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. 47 ఫిల్టర్ బెడ్ వద్ద మూడవ నెంబర్ పంపును ఎస్కార్ట్ మిషన్ సహాయంతో రిపేరు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయం కావటంతో పనులు నిలిపివేయటం జరిగింది. బ్రేక్ టైంలో ఒక్కసారిగా మంటలు రావటాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్ ప్రమాదాన్ని గమనించి పై అధికారులకు తెలియజేయటంతో వారు హుటాహుటిన పని ప్రదేశానికి చేరుకొని అక్కడ వున్న కార్మికులతో ప్రమాదాన్ని నివారించారు. ఈ మేరకు జరిగిన ప్రమాదంపై బీఎంఎస్ ఇల్లందు బ్రాంచి వైస్ ప్రెసిడెంట్ నాయని సైదులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సాధారణంగానే సింగరేణి ప్రాంతమైన ఇల్లందులో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని, అయినప్పటికీ యాజమాన్యం వేసవిలో తగుజాగ్రత్తలు తీసుకోకపోవటంతోనే అగ్నిప్రమాదం సంభవించిందని ఆరోపించారు. ఇప్పటికైనా యాజమాన్యం ఎండ తీవ్రత ఎక్కువ వున్నందున మిషనరి వేడి కూడా విపరీతంగా పెరిగి అగ్నిప్రమాదాల వల్ల కార్మికుల ప్రాణాలకు సైతం ముప్పు పొంచి ఉందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా కార్మికులు ఎండతీవ్రత వల్ల వడదెబ్బకు గురికాకుండా యాజమాన్యం తక్షణమే స్పందించి కార్మికుల పనివేళలు మార్చాలని బీఎంఎస్ డిమాండ్ చేస్తుందని అన్నారు.