మన్యం న్యూస్ చండ్రుగొండ మే 18 : వృద్ధులు వికలాంగులు వితంతువు ఒంటరి మహిళలకు ఆసరా పెన్షన్ ను ప్రభుత్వం ఇస్తుంది. ఈ పెన్షన్ ను ఎట్టి పరిస్థితులలో బ్యాంకులు అప్పులు, ఇతర వాటికి మళ్లించకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.కానీ కొన్ని బ్యాంకులు పట్టించుకోవడం లేదు. అప్పులకు జమ చేసుకుంటున్నాయి. రోజువారి కూలీలు, ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లే వారి నగదును సైతం అప్పులకు జమ చేసుకుంటున్నారు. ఈ బ్యాంకుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. దీంతో విసుగు చెందిన ఆసరా పెన్షన్ దారుడు, ఉపాధి హామీ పథకం కూలీలు, చండ్రుగొండ ఏపీజీవీబీ బ్యాంకు ఎదుట గురువారం నిరసన తెలియజేశారు. వివరాల్లోకి వెళితే… చండ్రుగొండ మండలం బాల్యతండా గ్రామానికి చెందిన ఆసరా పెన్షన్ దారుడు భూక్యా మిట్టు కు వచ్చే ఆసరా పెన్షన్ ను గత రెండు నెలలుగా ఏపీజీవీబీ బ్యాంకు అధికారులు ఖాతాను హోల్డ్ లో పెట్టి ఇవ్వడం లేదు. అదేవిధంగా దుబ్బతండా గ్రామానికి చెందిన జర్పుల కిషన్ కు ఉపాధి హామీ పథకం కూలి నగదును సైతం బ్యాంకు అకౌంట్ ను హోల్డ్ లో పెట్టి నగదు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఇలా మండలానికి చెందిన ఆసరా పెన్షన్ దారులు సుమారు 100 మంది వి, ఉపాధి హామీ పథకం కూలీలు 100 మంది వి అకౌంట్లను హోల్డ్ లో ఉంచి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. దీనికి ప్రధాన కారణంగా వ్యవసాయ రుణాలు చెల్లించడం లేదని, కుటుంబ సభ్యుల అప్పులు ఉన్నాయని, ఎస్ హెచ్ జి అప్పులు ఉన్నాయని, వ్యక్తిగత రుణాలు ఉన్నాయని సాకుతో బ్యాంకు అకౌంట్లను హోల్డ్ లో ఉంచి పెన్షన్ దారులను,ఉపాధి హామీ పథకం కూలీలను ఇబ్బందులు పెడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న బ్యాంకు అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆసరా పెన్షన్ దారులు, ఉపాధి హామీ పథకం కూలీలు, ప్రజా ప్రతినిధులు కోరుచున్నారు.
* రుణాల వసూల కోసమే అకౌంట్లను హోల్డ్ లో పెడుతున్నాం.. రవికుమార్ బ్యాంకు మేనేజర్, ఏపీజీవీబీ బ్యాంకు,చండ్రుగొండ : బకాయిలు పెరగటం వల్ల వసూలు కోసమే పెన్షన్ దారులు, ఉపాధి హామీ పథకం కూలీల అకౌంట్లను హోల్డ్ లో పెడుతున్నాం. ఇది మా వ్యక్తిగతం కాదు. బ్యాంకు భవిష్యత్ కోసం ఇలా చేశాం వారు వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడితే అకౌంట్ ను హోల్డ్ నుంచి తీసేస్తాం పెన్షన్ ఆపాలని ఉద్దేశం మాది కాదు. అప్పులు చెల్లిస్తే వారి పెన్షన్ వారికి ఇచ్చేస్తామన్నారు.
* బ్యాంకులకు నోటీసులు పంపిస్తాం…
ఎంపీడీవో రేవతి,చండ్రుగొండ.. ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పెన్షన్లు, ఉపాధి హామీ పథకం కూలీలు అకౌంట్లను హోల్డ్ లో పెట్టడం సరికాదు.ఇలా చేస్తున్నారనే విషయం ఇప్పుడే మా దృష్టికి వచ్చిందని, వెంటనే అన్ని బ్యాంకులకు నోటీసులు ఇస్తాం ఆసరా పెన్షన్ క్రమం తప్పకుండా ఇచ్చేలా చూస్తామని, అప్పులకు జమ చేస్తే చర్యలుంటాయని, పెన్షన్ దారులను ఇబ్బంది పెట్టొద్దన్నారు.