మన్యం న్యూస్, అశ్వారావుపేట, మే, 18: రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలోని అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు గేట్ల మరమ్మతులు ఎట్టకేలకు ఈ ఏడాది మార్చిలో ప్రారంభించారు. కానీ వర్షాకాలం సీజన్ ఆరంభం అయ్యేలోపు ఈ పనులు పూర్తయ్యే పరిస్థితులు కనిపించటం లేదు. జూన్ వర్షాలు కురిస్తే వచ్చే వరద నీరు ఆనకట్టలో నిల్వ ఉండటం కష్టమే. ఉన్నతాధికారులు దృష్టిసారించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు పూర్తిగా వంగిపోవటంతో వాటిని దింపేందుకు ఇబ్బందవుతోంది. నీటి విడుదలకు సమస్యలు ఎదురవుతున్నాయి. వాటి మరమ్మతులకు నీటిపారుదల శాఖ ఈఏడాది రూ 1.48కోట్లు మంజూరు చేసింది. మార్చిలో పనులు ప్రారంభించారు. ఎగువన కురిసే వర్షాలతో ఏటా తొందరగా ఆనకట్ట నిండుతోంది. ఒక్కోసారి జులైలోనే గేట్లు తెరిచి దిగువకు వరద వదలాల్సి వస్తోంది. అధికారులు జూన్ ఆఖరుకు పనులు పూర్తవుతాయంటున్నా రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.