- విత్తన డీలర్లతో సమావేశమైన ఏడి కరుణశ్రీ డీఎస్పీ రెహమాన్
- బిల్ బుక్, విత్తన స్టాక్ రిజిస్టర్స్ పక్కాగా ఉండాలన్న ఏడి
- నకిలీ విత్తనాలతో పట్టుపడితే కఠిన చర్యలు తప్పవన్న డీఎస్పీ
మన్యం న్యూస్: జూలూరుపాడు, మే 19, మండల పరిధిలోని పడమట నర్సాపురం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఏడి టి కరుణశ్రీ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెం డివిజన్ పరిధిలోని విత్తన డీలర్ల తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏడి మాట్లాడుతూ డీలర్స్ అందరూ విత్తనాలకు సంబంధించిన బిల్ బుక్స్, విత్తన స్టాక్ రిజిస్టర్స్ పక్కాగా ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. డీలర్ షాపులకు సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని సక్రమంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ మాట్లాడుతూ రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, పీడీ యాక్ట్ నమోదు అవుతుందని హెచ్చరించారు. ఎవరైనా నకిలీ ఇత్తనాలు అమ్ముతున్నట్లు మీ దృష్టికి వస్తే, వెంటనే మాకు తెలియజేయాలని కోరారు. విత్తన కేంద్రాలలో తనిఖీలు నిర్వహించేటప్పుడు పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని, ఇరు శాఖల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలలో నకిలీ విత్తనాల రవాణాను నియంత్రించేందుకు పోలీస్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయటం జరుగుతుందని తెలిపారు. నకిలీ విత్తనాల నియంత్రణలో తెలంగాణ గవర్నమెంట్ విత్తన చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశాలు ఉన్నాయని, కావున డీలర్లంతా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జూలూరుపాడు సిఐ వసంత్ కుమార్, ఎస్సై పోటు గణేష్, ఏవో రఘు దీపిక, తో పాటు, కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవి పల్లి, పాల్వంచ, సుజాతనగర్, మండలాల వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, ఆరు మండలాలకు చెందిన విత్తన డీలర్లు తదితరులు పాల్గొన్నారు.