*మన్యం న్యూస్, ఇల్లందు… పట్టణ ప్రజలకు వేసవికాలంలో నీటి సమస్య రాకుండా ఉండేందుకు స్థానిక ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ సూచనల మేరకు ఇల్లందు పురపాలక సంఘం ముందస్తుగా పకడ్బందీ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే మిషన్ భగీరథ కార్యాలయం నందు అధికారులతో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కమిషనర్ అంకుషావలిలు శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ… ఇల్లందు పట్టణంలో నీటి సమస్య రాకుండా ఉండేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వేసవికాలంలో సైతం ప్రతిరోజు నీళ్లు ఇచ్చేందుకు కసరతులు ముమ్మరం చేశామన్నారు. పట్టణ ప్రజలు ఎవరూ కూడా నీటిని వృధా చేయొద్దని అవసరం మేరకు మాత్రమే నీటిని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపాలిటీ ఏఈ శంకర్, మిషన్ భగీరథ ఏఈ చిరంజీవి, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.