నా నమ్మకం.. నా ఆత్మవిశ్వాసం మీరే
*గార్ల మండల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్
మన్యం న్యూస్,ఇల్లందు…ఇల్లందునియోజకవర్గంలోని గార్ల మండలం విజయ్ కృష్ణతార ఫంక్షన్ హాల్లో శనివారం బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్, మహబూబాద్ జిల్లాపరిషత్ చైర్ పర్సన్ ఆంగోత్ బిందు ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హరిప్రియ నాయక్ మాట్లాడుతూ… ఇల్లందు నియోజకవర్గ అధికారం కోసం తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయని, చీకటి యుద్ధం చేస్తున్నారని అయినప్పటికీ నియోజకవర్గ ప్రజల నుంచి తనను వేరుచేయలేరని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ స్పష్టం చేశారు. నా నమ్మకం, నా విశ్వాసం ప్రజలు మాత్రమేనని దేవుడి చల్లని దీవెనలు, ప్రజల మద్దతు ఉన్నంతవరకు నన్ను బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎవరు ఏమి చేయలేరన్నారు. రానున్న ఎన్నికల్లో తాను అత్యధిక మెజారిటీతో గెలవటం ఖాయమని, నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేసారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.