మన్యం న్యూస్: జూలూరుపాడు, మే 20, ప్రతి ఏట ఖరీఫ్ పంటల ప్రారంభ సీజన్ లో రైతులకు మాయ మాటలు చెప్పి నకిలీ విత్తనాలను అంటగట్టి దర్జాగా సొమ్ము చేసుకుంటున్నా కొందరు కేటుగాళ్ల ఆటలు కట్టించడానికి పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో నకిలీ విత్తనాల అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధమయింది. పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ప్రాంతమైన వినోబా నగర్ గ్రామం వద్ద జూలూరుపాడు పోలీస్ శనివారం చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. జూలూరుపాడు సిఐ వసంత్ కుమార్, ఎస్సై గణేష్ తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాల అక్రమ రవాణా,
నకిలీ లిక్కర్ రవాణా, గంజాయ్ రవాణా, అక్రమ పశువుల రవాణాలకు చెక్ పెట్టేందుకే ఈ చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.