UPDATES  

 విపక్షాలపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్

  • ఇల్లందు మండలం కొమరారంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం*

మన్యం న్యూస్,ఇల్లందు:ఇల్లందు మండలం కొమరారంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పార్టీ కార్యకర్తల కేరింతల నడుమ సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ కు కొమరారం గ్రామప్రజలు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రారంభమైన ఆత్మీయ సమ్మేళన సభలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశయ సాధనకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. గ్రామ గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఎంతోమంది ఉన్నారు అన్నారు. దుష్ట రాజకీయాలు చేసే కొంతమంది ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చి స్వార్థపూరిత రాజకీయాలకు తెరలేపుతూ కాకమ్మ కబుర్లు చెబితే నమ్మే పరిస్థితులలో ప్రజలు లేరని తెలిపారు. వారి పాలనలో ఇల్లందు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమని, స్వలాభం తప్ప నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోని వారు నేడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అవాకులు చవాకులు పేలితే చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అలాంటివారికి కార్యకర్తలు, ప్రజలే తప్పకుండా తగినబుద్ది చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీని, సీఎంని విమర్శించే వారిని ప్రజలే నిగ్గదీసి అడిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మరోసారి విమర్శిస్తే ఖబర్దార్ అంటూ హరిప్రియ హరిసింగ్ నాయక్ హెచ్చరించారు. జాతీయస్థాయిలో “అబ్ కి బార్.. కిసాన్ సర్కార్” అనే నినాదంతో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి దేశస్థాయిలో ప్రభంజనం సృష్టిస్తున్నారన్నారు. రైతులకు రైతు బీమా, రైతు బంధు, ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి సాయం, ఉచిత కరెంటు, అందిస్తూ రైతును తెలంగాణలో రాజుగా చేయడం సీఎం కేసీఆర్ ఘనతగా అభివర్ణించారు. నిరుపేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లతో అంగరంగ వైభవంగా కళ్యాణం చేసుకునేందుకు లక్ష రూపాయలపై చిలుకును పెండ్లి కానుకగా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. కంటి వెలుగు యావత్తు దేశానికే ఆదర్శంగా మారిందన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో ఉచితంగా కొన్ని కోట్లాదిమంది కంటి పరీక్షలు చేయించుకుని కళ్లద్దాలు, కంటి శస్త్ర చికిత్సలు, ఐడ్రాప్స్ లాంటివి తీసుకుని లబ్ధి పొందారని తెలిపారు. నేడు ప్రతిగ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. గ్రామాలకు ప్రయాణించేందుకు సిసి రోడ్లు, రాత్రి వేళల్లో వీధిలైట్లు, తాగునీరు అందించేందుకు ప్రతిఇంటికి నల్లా కనెక్షన్, వీధులు పరిశుభ్రంగా ఉండేందుకు డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పచ్చని చెట్లు, రైతువేదికలు తదితర వాటితో తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా మారాయి అన్నారు.
కొంతమంది తనను అప్రతిష్ట పాలు చేసేందుకు బురద జల్లుతున్నారని అలాంటివారికి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా నా హయాంలో అభివృద్ధి చేసి చూపిన నాపై మరోమారు విమర్శలు గుప్పిస్తే సహించేది లేదని, ఎవరి హయాంలో నియోజకవర్గం అభివృద్ధి చెందిందొ ప్రజలకు తెలుసనీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. స్వార్ద రాజకీయాలు చేసే మిమ్మల్ని ప్రజలే చెప్పుతో కొట్టే సమయం ఆసన్నమైందని విపక్ష పార్టీలపై, నాయకులపై మండిపడ్డారు.
ఇల్లందు మండలంలో త్వరలో పోడుభూమి పట్టాలను పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, ఇల్లందు మండల అధ్యక్షుడు శీలం రమేష్, పట్టణ అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, ఇల్లందు మండల వైస్ ఎంపీపీ దాస్యం ప్రమోద్, డిసిసిబి డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు కుంజ కృష్ణ, మరియు సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డ్ నెంబర్లు, గ్రామశాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, ఇల్లందు పట్టణ మహిళా అధ్యక్షురాలు నెమలి ధనలక్ష్మి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !