పాలనలో మేటి..మానవత్వంలో ఘనాపాటి మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే హరిప్రియ ప్రమాదానికి గురైన వృద్ధురాలికి ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ సాయం
మన్యం న్యూస్,ఇల్లందు..ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ మరోమారు తన మానవత్వాన్ని చాటుకొని ప్రజాసేవలో తనకుతానే సాటి అని నిరూపించుకున్నారు. ఇల్లందు-ఖమ్మం రహదారిలో రఘునాథపాలెం గ్రామం నందు ఓ వృద్ధురాలు ద్విచక్ర వాహనంపై నుంచి క్రింద పడిపోవడాన్ని చూసి ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ చలించిపోయారు. వెంటనే తన కాన్వాయ్ ఆపి వృద్ధురాలికి సపర్యలు అందించారు. ఎమ్మెల్యే మంగళవారం శుభకార్యం నిమిత్తం ఖమ్మం వెళ్తుండగా బ్యాంకుకాలనీ రోడ్డు మీదుగా బైక్ పై వెళ్తున్న ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు కింద పడిపోవడాన్ని గుర్తించి వెంటనే స్పందించి తన కాన్వాయ్ ఆపి నేరుగా కింద పడిపోయిన వృద్ధురాలు వద్దకు వెళ్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావు, ఇల్లందు పట్టణ అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, గన్మెన్ సహాయంతో వృద్ధురాలిని పైకి లేపారు. అనంతరం కారులో నుంచి మంచినీళ్ల బాటిల్ తీసుకువచ్చి స్వయంగా తాగించారు. ఈ ప్రమాదంలో వృద్ధురాలికి గాయాలు కావడంతో ఆటోను మాట్లాడి చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆపదలో ఉన్న వృద్ధురాలికి సహాయంతో పాటు సపర్యలు చేయటంతో ఎమ్మెల్యే మానవత్వాన్ని అక్కడున్న ప్రజలు కొనియాడారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ ఇల్లందు పట్టణ అధ్యక్షులు నాదెండ్ల శ్రీనివాసరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, ఐతనబోయిన విఠల్ రావు, జర్పుల బాలనాయక్ ఉన్నారు.
