మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ హక్కులను కాలరాస్తూ కార్పోరేట్ సంస్థల కుబేరులకు కొమ్ముకాస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఏఐటియుసి జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో శుక్రవారం జరిగిన ఏఐటియుసి అనుబంద ఉద్యోగ, కార్మిక సంఘాల జిల్లా స్థాయి జనరల్ మాడీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిదిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్రోద్యమంలో నుంచి పుట్టిన ఏఐటియుసి నాటి నుంచి నేటి వరకు కార్మికులు, ఉద్యోగుల పక్షాన పోరాడుతూ అనేక హక్కులు, చట్టాలను సాధించిపెట్టిందన్నారు. నూరేళ్ళ చరిత్ర ఉన్న ఏఐటియుసితోనే కార్మికులు, ఉద్యోగుల హక్కులు పరిరక్షించబడతాయన్నారు. ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యాజమాన్యాలకు, పరిశ్రమల పెద్దలకు అనుకూలంగా మార్చే కుట్రలు చేస్తోందని, 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా విభజించి శ్రమజీవులను దోచుకునే కుట్రలకు తెరలేపిందన్నారు. ప్రభుత్వరంగంలో నడవాల్సిన సింగరేణి, బిఎస్ఎన్ఎల్, రైల్వే, విమానయానం వంటి అనేక సంస్థలను కారుచౌకగా అంబాడీ, ఆదానీలాంటి కుబేరులకు అమ్ముతోందని విమర్శించారు. ప్రభుత్వం పథకాల అమలుకోసం నియమించుకున్న స్కీమ్ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వరంంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులను, స్కీమ్ వర్కర్లను క్రమబద్దీకరించి వారికి పనిభద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు సూచనమేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘటిత, అసంఘటిత కార్మికులు, ఉద్యోగుల సమస్యలే ఎజెండాగా జూన్ 4న కొత్తగూడెంలో జరిగే ప్రజా, కార్మిక గర్జన బహిరంగ సభకు కార్మికులు, ఉద్యోగులను తరలించే భాద్యతను ఏఐటియుసి నాయకత్వం నెరవేర్చాలని కోరారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె. సాబీర్ పాషా, ఏఐటియుసి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరాటి ప్రసాద్, గుత్తుల సత్యనారాయణ, రాష్ట్ర నాయకురాలు జె.సీతామహాలక్ష్మి, నాయకులు కె.రత్నకుమారి, గోనె మణి, మంద నిర్మల, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.