వేజ్ బోర్డు చర్చల్లో కాంట్రాక్టు కార్మికులకు మొండిచేయి చూపించిన జేబీసీసీఐ సంఘాలు
వేజ్ బోర్డు సంఘాలను నిలదీయాలని కార్మికవర్గానికి ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు యాకూబ్ షావలి పిలుపు
*మన్యం న్యూస్,ఇల్లందు…ఇల్లందు సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో జెకె5 ఓసి డిబ్లాక్ వేబ్రిడ్జి వద్ద బెల్టు క్లీనింగ్ లోడింగ్, అన్లోడింగ్ కార్మికుల జనరల్ బాడీ సమావేశం శనివారం జరిగింది. ఈ జనరల్ బాడీలో ఐఎఫ్టీయూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి పాల్గొని మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా బొగ్గుగని కార్మికుల వేతన ఒప్పందంలో ఈసారైనా న్యాయం జరుగుతుందని ఆశించిన కాంట్రాక్టు కార్మికులకు వేజ్ బోర్డు సంఘాల ద్వందవైఖరి మూలంగా చివరికి అన్యాయమే జరిగింది అన్నారు. ఇప్పటికే హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయబడుతున్నాయని పచ్చి అవాస్తవాలను చర్చల్లో మాట్లాడారని, కార్మికుల సామాజిక భద్రత కోసం సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తున్నామని చివరి లైన్లో రాసుకున్నారని ఇది పూర్తిగా కార్మికులను మోసం చేయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013 నుంచి రావలసిన హైపవర్ కమిటీ వేతనాలను నేటికీ అమలు చేయకుండా కాంట్రాక్టు కార్మికుల శ్రమను దోచుకుంటున్న బొగ్గు పరిశ్రమ యాజమాన్యాలు ఈసారైనా కాంట్రాక్టు కార్మికులకు వేతన ఒప్పందాన్ని వర్తింపజేయాలని ఐఎఫ్టీయూ అనేక దఫాలుగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహించినప్పటికీని, వేజ్ బోర్డు సంఘాల చెవిలో వినిపించినప్పటికీని చెవిటివాని చెవిలో శంఖం ఊదినట్లుగా వేజు బోర్డు సంఘాల వైఖరి ఉన్నదని ఆవేదన వెళ్లగక్కారు. వేజ్ బోర్డు సంఘాలు సింగరేణిలో ఒక విధంగా వేజ్ బోర్డు చర్చల్లో మరొకవిధంగా ద్విపాత్రాభినయం పోషిస్తూ కాంట్రాక్ట్ కార్మికులను దగా చేస్తున్నాయని యాకూబ్ షావలి మండిపడ్డారు. కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లపై ఎలాంటి చర్చ జరగకుండానే 11వ వేతన ఒప్పందాన్ని ముగించిన వేజ్ బోర్డు సంఘాల వైఖరిని నిలదీయాలని కాంట్రాక్టు కార్మికులకు ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాంట్రాక్టు కార్మికులు భాను, సత్యనారాయణ, దుర్గారావు, వీరస్వామి, గుంశావలి, సతీష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.