సమగ్ర సంక్షేమ చట్టం, క్రమబద్ధీకరణ హామీ అమలుకోసం పోరాడుదాం
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
కార్మిక క్షేత్రాల్లో ప్రజాగర్జన ప్రచార జీపు జాత
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సమగ్ర సంక్షేమ చట్టం, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల క్రమబద్ధీకరణ హామీ అమలుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చి సాధించే సత్తా కేవలం సిపిఐకే ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పునదార్ఘటించారు. వచ్చే నెల 4న కొత్తగూడెంలో జరిగే ప్రజాగర్జన బహిరంగ సభ ప్రచారంలో భాగంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని హమాలీ కార్మికుల అడ్డా, మున్సిపల్ కార్మికుల అడ్డాలో జరిగిన సభలకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. భవన నిర్మాణ సంక్షేమ చట్టం సిపిఐ కృషి ఫలితమేనని, ఈ తరహాలోనే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ చట్టం కోసం కేంద్రంపై వత్తిడి తెస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు, ఉద్యోగులకు ఇచ్చిన క్రమబద్దీకరణ హామీని అమలు చేయాలని, ఈ హామీని కొన్ని శాఖలకే పరిమితం చేసి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలు, యాజమాన్యాలకు తొత్తుగా మారి కార్మికుల హక్కులను కాలరాసే కుంట్రలు చేస్తోందని ఈ కుట్రలను ఉద్యమాలతోనే తిప్పికొట్టాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, చట్టబద్దమైన హక్కుల అమను డిమాండ్ చేస్తూ జరుగుతున్న ప్రజాగర్జన బహిరంగ సభకు అన్ని రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా, మున్సిపల్ సిపిఐ పక్ష నాయకులు వై.శ్రీనివాసరెడ్డి, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి గెద్దాడు నగేష్, హమాలీ, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.





