- గాలి వాన బీభత్సం
- ఇంటి పై కప్పులు ధ్వంసం
- స్తంభించిన రవాణా వ్యవస్థ
- విద్యుత్ సరఫరాకు అంతరాయం
మన్యం న్యూస్: జూలూరుపాడు, మే 28, మండల పరిధిలో ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా విరుచుకుపడ్డ గాలి వాన బీభత్సం సృష్టించింది. మండల పరిధిలోని మాచినేనిపేట, కాకర్ల, నర్సాపురం, దుబ్బ తండ తదితర గ్రామాలలో ఇంటి పైకప్పులు ధ్వంసమయ్యాయి. గాలి వాన బీభత్సానికి జూలూరుపాడు కొత్తగూడెం ప్రధాన రహదారి సాయిరాం తండా వద్ద చెట్లు విరిగి రోడ్డుకు అడ్డు పడడంతో రవాణా వ్యవస్థ సుమారు గంటపాటు స్తంభించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామ ప్రజలు, ప్రయాణికుల సహకారంతో విరిగిన చెట్లను తొలగించారు. పలు గ్రామాలలో వీధుల వెంట చెట్లు విరిగి పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మాచినేని పేట గ్రామానికి చెందిన వాంకుడోత్ చిన్న, కాకర్ల గ్రామానికి చెందిన పదిమల కృష్ణ, దుబ్బ తండా కు చెందిన లాకావత్ సేవియా లకు సంబంధించిన ఇంటి పైకప్పులు గాలివాన బీభత్సంతో పూర్తిగా ధ్వంసమయ్యాయి. బాధిత కుటుంబాలు తమకు ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని కోరారు.





