పండుగ వాతావరణంలో వైభవోపేతంగా దశాబ్ది వేడుకల నిర్వహణ: జిల్లా కలెక్టర్
– రైతు దినోత్సవం ఊరురా చెరువుల పండుగ నిర్వహణకు ప్రత్యేక మానిటరింగ్ కమిటీ
– రాష్ట్ర దశాబ్ది వేడుకల నిర్వహణపై సిఎస్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్
ఉన్నత అధికారులు.
మన్యం న్యూస్ ఏటూరు నాగారం/ములుగు
పండుగ వాతావరణంలో వైభవోపేతంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించ నున్నట్లు ములుగు జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య తెలిపారు.సోమవారం హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ములుగు జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య,ఐటిడిఏ పిఓ అంకిత్,జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి,డిఎఫ్ఓ రాహుల్ జాదవ్,ఓఎస్డీ అశోక్ కుమార్,ఇరిగేషన్ సిఈ విజయ భాస్కరరావు,డిఆర్ఓ రమాదేవిలతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
సిఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ జూన్ 2 నుండి జూన్ 22 వరకు రాష్ట్ర దశాబ్ది వేడుకలలో మన ప్రగతి చాటే విధంగా ఘనంగా నిర్వహించాలన్నారు.
రైతు దినోత్సవం,ఊరురా చెరువుల పండుగ నిర్వహణ పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపిస్తూ ప్రణాళిక తయారు చేసుకోవా లని సూచించారు.రైతు దినోత్సవం నాడు జిల్లాలో ఉన్న రైతు వేదికలో వేడుకలు జరగాలని, ప్రతి గ్రామం నుంచి రైతులను డప్పులుతో ఘనంగా పండుగ వాతావరణంలో రైతు వేదికలకు తీసుకొని రావాలని, అక్కడ ప్రభుత్వం ప్రతి రైతుకు కల్పించిన సౌకర్యాలు,అందించిన సహాయంపై తెలియజేయాలని,భోజన ఏర్పాట్లు ఉండాలని అన్నారు.జూన్ 8న ఊరురా చెరువుల పండుగ సందర్భంగా గ్రామాల్లో ఉన్న పెద్ద చెరువు వద్ద బతుకమ్మ, బోనాలతో సాంస్కృతిక కార్యక్రమాలు, కట్ట మైసమ్మ పూజ,భోజనాలు పకడ్బందీగా చేయాలని తెలిపారు.రైతు దినోత్సవం,ఊరురా చెరువుల పండుగ నిర్వహణకు జిల్లాలో అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలని, క్షేత్ర స్థాయిలో ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలని,ఎక్కడా ఎలాంటి పొరపాట్లు కావద్దని సీఎస్ అన్నారు. విద్యుత్ రంగంలో గత పరిస్థితి,నేడు సాధించిన ప్రగతి తెలియజేస్తూ నాడు- నేడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని,పోలీస్ ఆధ్వర్యంలో సురక్షా దివస్,తెలంగాణ రన్ నిర్వహించాలని అన్నారు.పారిశ్రామిక ప్రగతి,సాగునీటి రంగంలో సాధించిన విజయాలు తెలియజేయాలని అన్నారు. జూన్ 9న సంక్షేమ సంబురాలు సందర్బంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రెండవ విడత గొర్రెల పంపిణీ, అవకాశం ఉన్నచోట ఇంటి పట్టాల పంపిణీ బిసి కులవృత్తుల ఆర్థిక సహాయం ప్రారంభించాలని అన్నారు.బీసి కుల వృత్తుల ఆర్థిక సహాయంపై క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ప్రకారం మార్గదర్శకాలు అందిస్తామని,దాని ప్రకారం లబ్దిదారులను ఎంపిక చేసి జూన్ 9న ప్రారంభించాలని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని లీలా గార్డెన్ లో 1000 మందితో కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగా కేసిఆర్ న్యూట్రిషన్ కిట్లు,కేసిఆర్ కిట్లు లబ్ధిదారులను పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం చేస్తామని వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 89 సబ్ సెంటర్ ప్రారంభించుకున్నట్టు తెలిపారు.జిల్లా ఇంఛార్జి మంత్రిచే ఎఎంసి గోదాం, ఏటూరునాగారంలో డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.మహిళ ఆరోగ్య వైద్య బృందాన్ని,ఆశా వర్కర్లను ఎక్కువ మొత్తంలో భాగస్వామ్యం చేసి కార్యక్రమ విజయవంతంకి ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. అంగన్ వాడి టీచర్లు,సిబ్బంది మహిళా సంక్షేమం కోసం తీసుకుంటున్న కార్యక్రమాలు వాటి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమావేశం ఏర్పాటు చేసేవిధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు. జిల్లాలో అన్ని శాఖల ద్వారా సాధించిన ప్రగతి వివరించేలా పకడ్బందీగా దశాబ్ది వేడుకలను నిర్వహిస్తామని అన్నారు.ఈ సమావేశంలో డిఎం హెచ్ఓ అప్పయ్య, జడ్పీ సీఈఓ ప్రసూనరాణి,జనరల్ మేనేజర్ ఇండస్ట్రీస్ జి శ్రీనివాస్, ఐటిడిఏ డిడి పోచం,రవాణా శాఖ అధికారి శ్రీనివాస్,డిపిఓ వెంకయ్య,డిఏఓ గౌస్ హైదర్,ఈడి ఎస్సీ కార్పొరేషన్ టి.రవి, డిసిఓ సర్దార్ సింగ్,జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతి,సిపిఓ ప్రకాష్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.





