- గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి.
- ఇల్లెందు ఎండిఓ కార్యాలయం ముందు జేఏసీ ధర్నా
- ఎండిఓ,ఎంపీఓ లకు వినతి.
మన్యంన్యూస్ ఇల్లందు: గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సోమవారం ఇల్లెందు మండల పరిషత్ కార్యాలయం ముందు గ్రామపంచాయతీ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎండిఓ బాలరాజు, ఎం.పి.ఓ చిరంజీవి లకు వినతి పత్రాలు సమర్పించారు.జిల్లా జేఏసీ కోకన్వీనర్ జటంగి వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధానకార్యదర్శి కొక్కు సారంగపాణి, ఐఎఫ్టియు జిల్లా సహాయకార్యదర్శి ఎస్కే.యాకూబ్ షావలి పాల్గొని మాట్లాడుతూ నిత్యం గ్రామాలను శుభ్రపరుస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. చాలీచాలని వేతనాలతో కార్మికులు దుర్భరమైన జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం 19వేల రూపాయలు ఇవ్వాలని,మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని,ఎనిమిది గంటలపని అమలు చేయాలని, చట్టబద్ధమైన హక్కులు,సౌకర్యాలు, ప్రమాద బీమా కల్పించాలని ప్రతినెల రెగ్యులర్గా వేతనాలు ఇవ్వాలని,కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించి పదోన్నతులు కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈకార్యక్రమంలో నాయకులు తొగరసామేల్, రామిశెట్టి నరసింహారావు, గురునాథం, చింతల భాగ్యలక్ష్మి, ఈసం అరుణ, వై.రాధాకృష్ణ, వంశీ, వి.అశోక్, విజయ్ కుమార్, తాండ్ర కిరణ్, కే.సంపత్,ఏ.మంజి, సాయి, ఎం. శ్రీధర్,పడిగకోటి, భీముడు తదితరులు పాల్గొన్నారు.





