మన్యం న్యూస్: జూలూరుపాడు, జూన్ 01, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నుండి 22 వరకు జరగబోయే దశాబ్ది ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎండిఓ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ శాఖల సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో కొత్తగూడెం సహాయ వ్యవసాయ శాఖ సంచాలకులు టి కరుణ శ్రీ పాల్గొని మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ మూడవ తారీకున నిర్వహిస్తున్న రైతు దినోత్సవ వేడుకలలో భాగంగా మండల పరిధిలోని నాలుగు రైతు వేదికలలో నిర్వహించే రైతుల సహబంతి భోజన కార్యక్రమానికి వెయ్యి మందికి తగ్గకుండా హాజరయ్యేలా అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. ప్రతి రైతు వేదిక పరిధిలో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల తో క్లస్టర్ పరిధిలోని రైతులంతా ర్యాలీ నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి రైతు వేదిక నందు సుమారు 1000 మందికి భోజన ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. కావున మండల పరిధిలోని రైతులంతా రైతు దినోత్సవ వేడుకలకు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శారద, మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్ రఘు దీపిక, ఎఫ్ ఆర్ వో ప్రసాద్ రావు ఆర్ఐ తిరుపతి, ఎంపీఓ కృష్ణ తో పాటు పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ శాఖ విస్తరణాధికారులు తదితరులు పాల్గొన్నారు.