- మున్సిపల్ ఆఫీస్ ముందు మున్సిపల్ దళిత ఉద్యోగుల ధర్నా
- శానిటరీ ఇన్స్పెక్టర్ పై కౌన్సిలర్ భర్త దాడికి నిరసనగా విధులు బహిష్కరించిన దళిత కార్మికులు
మన్యం న్యూస్,ఇల్లందు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీ నందు ప్రభుత్వ ఉద్యోగి అయిన శానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణపై స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ భర్త యలమందల వాసు బుధవారం దాడి చేయటం జరిగింది. వివరాల్లోకి వెళితే…పొదిలి కళావతి అనే మహిళ పేరిట 2020-2023 సంవత్సరానికి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ ఇవ్వాలని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణను కౌన్సిలర్ భర్త యలమందల వాసు కోరాడు. అయితే ఆ సమయంలో తాను విధుల్లో లేనని, ట్రేడ్ లైసెన్స్ చెల్లించినట్లు ఉన్న రశీదు అందజేయాలని తెలిపారు. రశీదు బుక్కులో ఉంటే పై అధికారిని అడిగి ఇస్తామని అధికారి తెలిపారు. ఈ మేరకు సదరు కౌన్సిలర్ భర్త ఇష్టం వచ్చినట్లు తిట్ల పురాణం అందుకొని , బయటికి వస్తవుగా నీ సంగతి చూస్తా అంటూ రౌడీయిజాన్ని ప్రదర్శించాడు. తాను విధుల్లో లేని సమయంలో లైసెన్స్ ఇచ్చి ఉద్యోగాన్ని కొల్పోవాలా అంటూ ఉద్యోగి కన్నీరుమున్నీరుగా విలిపించటం జరిగింది. ఈ నేపథ్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణపై జరిగిన దాడికి నిరసనగా మున్సిపల్ కార్మికులు గురువారం విధులను బహిష్కరించి స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. దళిత ఉద్యోగిపై దాడి హేయమని, సదరు అధికారికి న్యాయం చేయాలని అన్నారు. యలమందల వాసుపై కటినచర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు.