UPDATES  

 శాంపిల్ పేరుతో మిర్చి విత్తనాల అధిక ధరలకు విక్రయాల జోరు…

మన్యం న్యూస్ చండ్రుగొండ మే 31 : ప్రభుత్వం ఓ పక్క విత్తనాల విక్రయాలపై డీలర్లు, ఫెర్టిలైజర్లషాపుల యజమానులు, కంపెనీ ప్రతినిధులు, రైతులకు అవగాహన సదస్సు పెడుతున్న, విత్తనాల విక్రయాల సమయంలో రైతులకు మోసం చేసే విధానం కొనసాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా మండలంలోని రైతులకు విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తూ మోసం చేస్తున్న నకిలీ డీలర్లను స్థానిక పోలీసులు పట్టుకున్న సంఘటన బుధవారం చండ్రుగొండ మండలంలో గుర్రంగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… గుర్రంగూడెం గ్రామంలో సుజాతనగర్ గ్రామానికి చెందిన భూషణం అనే వ్యక్తి కంపెనీ ప్రతినిధి అని చెప్పుకుంటూ శాంపిల్ మిర్చి విత్తనాలను రైతులకు అమ్ముతున్నాడు.మాది ఒరిజినల్ విత్తనాల కంపెనీ అని, శాంపిల్ విత్తనాలు వచ్చాయని ఒక్కో ప్యాకెట్ పై రూ.500 నుండి రూ 1000 వరకు అధికంగా విక్రయిస్తున్నారు. కొత్తగూడెం పట్టణంలో విత్తన కంపెనీ డీలర్ నుండి మిర్చి విత్తనాల ప్యాకెట్లను మండలానికి తీసుకొచ్చి మండలంలో గుర్రంగూడెం, బెండలపాడు,గానుగపాడు, చంద్రుగొండ, మంగయ్యబంజర్, పోకలగూడెం, గ్రామాలలో గత కొద్ది రోజులుగా రైతులకు విక్రయిస్తున్నాడు. బుధవారం గుర్రంగూడెం గ్రామంలో బిల్లులు లేకుండా విత్తనాలు అమ్ముతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి, భూషణాన్ని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. అశ్వరావుపేట వ్యవసాయ శాఖ ఏడిఏ అఫ్జల్ బేగం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఉన్న విత్తనాలను పరిశీలించి, ఈ విత్తనాలు మోనోసేంట్ కంపెనీకి చెందిన మిర్చి విత్తనాలు అని, నకిలీ విత్తనాలు కావని చెప్పారు. కాకపోతే కొత్తగూడెం డీలర్ వద్ద నుంచి రసీదులు లేకుండా తీసుకొచ్చి ఇక్కడ తప్పుడు పద్ధతిలో విక్రయాలు జరుపుతున్నారు. ఇది చట్ట విరుద్ధమని, దీనిపై సంబంధిత డీలర్ కు నోటీసులు జారీ చేస్తామన్నారు. ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి వివరణ కోరగా… విత్తనాలు వ్యవసాయ శాఖ అధికారులకు చూపించడం జరిగిందని, రైతులు వచ్చి బిల్లు చూపిస్తే విత్తనాలు రిలీజ్ చేస్తామన్నారు. తప్పుడు పద్ధతిలో రైతులకు బిల్లు లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న నకిలీ డీలర్లపై చర్యలు తీసుకోవాలని మండల రైతులు, విత్తనాల విక్రయ డీలర్లు కోరుచున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !