పందెం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
జూలై 1న నిర్వహించనున్న గ్రూప్ ఫోర్ పరీక్షల నిర్వహణకు విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఐడిఓసి కార్యాలయంలో గ్రూప్ ఫోర్ పరీక్ష నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, లైజనింగ్ అధికారులు, రూట్ ఆఫీసర్లుతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జులై 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్-I, మధ్యాహ్నం 2:30 నుంచి 5.00 గంటల వరకు పేపర్-II పరీక్ష ఉంటుందన్నారు. పరీక్ష నిర్వహణకు ఏర్పాటు చేసిన 77 కేంద్రాలలో దాదాపు 27 వేల మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలన్నారు. పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేకాధికారులను నియమించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ నిబంధనలకు లోబడి పరీక్షా కేంద్రాలలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని, ఎలాంటి పొరపాట్లకు తావియ్యరాదని సూచించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పరీక్ష జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణకు లైజన్ అధికారులను నియమించడం జరిగిందని, వారు చీఫ్ సూపరిన్ టెండెంట్ లు సమన్వయంతో పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చేయాలని సూచించారు. ముందస్తు పరీక్ష కేంద్రాన్ని సందర్శించి, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, రైటింగ్ పాడ్స్ అనుమతించరని తెలిపారు.పరీక్ష రాసే అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకుని రావాలి అని ఆయన చెప్పారు. అదేవిధంగా పరీక్ష పూర్తి అయిన తర్వాత మీ యొక్క నామినల్ రోస్ లో ఎడమ చేతి వేలిముద్ర తప్పకుండా వెయ్యాలి అని ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, తదితర మౌలిక సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు. పరీక్షా సమయంలో నిరంతరాయంగా విద్యుత్తు ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరుకునేలా ఆయా రూట్లలో తగినన్ని బస్సులను నడపాలని ఆర్టీసీ వారికి సూచించారు. అదే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ కిట్, ఓ.ఆర్.ఎస్ పాకెట్లతో ఏఎన్ఎమ్ ను, ఆశా వర్కర్ ను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ఆయా అధికారులందరూ సమన్వయంతో పని చేసి గ్రూప్ 4 పరీక్ష సజావుగా నిర్వహించాలని కోరారు. అభ్యర్థులకు ప్రశ్నాపత్రాలు, ఓ.ఎం.ఆర్ షీట్‌లను ఇచ్చే సమయంలో అభ్యర్థులకు బబ్లింగ్ విధానంపై అవగాహన కల్పించాలన్నారు. బబ్లింగ్‌లో ఏ మాత్రం పొరపాటు జరిగినా పరిగణలోకి తీసుకోవడం జరగదన్న విషయాన్ని తెలియజేయాలన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.