మన్యం న్యూస్: జూలూరుపాడు, జూన్ 28, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని బోజ్యా తండా గ్రామ పంచాయతీకి గత ఐదు సంవత్సరాల క్రితం, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగము భద్రాచలం ఆధ్వర్యంలో సుమారు మూడు కోట్ల రూపాయలతో బీటీ రోడ్డు మంజూరు కాగా, ఇప్పటివరకు రోడ్డు నిర్మాణం పూర్తి కాకపోవడం గమనార్హం. సుమారు మూడు కిలోమీటర్ల పొడవునా గ్రావెల్ తొలి వదిలేయడంతో, పక్కనే ఉన్న సీతారామ ప్రాజెక్ట్ వాహనాలు, టిప్పర్, బండ్లు రోజు అదే రహదారి నుండి ప్రయాణించడంతో, అంతంత మాత్రాన ఉన్న రోడ్డు సైతం రాళ్లు తేలిపోయి కాలినడకన వెళ్లే కూలీలకు, పొలాలకు వెళ్లే ప్రయాణం కాస్త నరకంలా మారింది. బోజ్యా తండా కు వెళ్లే ద్విచక్ర వాహనాలు, పొలాలకు వెళ్లే వాహనాలు సైతం పంచర్లు కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణ పనులు తక్షణమే పూర్తి చేయాలని, పూర్తి చేయని యెడల సేవాలాల్ సేన ఆధ్వర్యంలో భారీ ఆందోళనకు దిగుతామని సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు నవీన్ రాథోడ్ బుధవారం తెలిపారు.
ఈ కార్యక్రమంలో ధరంసోత్ స్వామి నాయక్, మాలోత్ సక్కా నాయక్, ధరావత్ లచ్చిరామ్ నాయక్, మాలోత్ సురేష్ నాయక్, ధరావత్ లాలూ నాయక్, శ్రీహరి, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు